– ప్రతిపక్ష పార్టీల నేతలకు మమత లేఖ
– కేంద్రంపై యుద్ధానికి ఏకమౌదామంటూ పిలుపు
– మమత వెనుక కేసీఆర్ నిలబడతారా?
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనేది కేసీఆర్ కల. దానికోసం మోడీపై యుద్ధం కూడా ప్రకటించారు. కాంగ్రెస్ పని అయిపోయింది.. ఇక ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని వరుసగా ఒక్కొక్కర్ని కలవడం స్టార్ట్ చేశారు. అయితే.. కాంగ్రెస్ లేని కూటమి కష్టమనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. పైగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన అంచనాలు తప్పాయి. దీంతో కేసీఆర్ చల్లబడ్డారు. యుద్ధం సంగతి ఏమోగానీ జాతీయ రాజకీయాల ఊసే ఎత్తడం లేదు.
ఆఖరికి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూడా మంత్రులను ఢిల్లీ పంపారేగానీ కేసీఆర్ వెళ్లలేదు. అన్ని తిట్లు తిట్టి ఏ మొహం పెట్టుకుని వచ్చారనే విమర్శలు వస్తాయనే కారణంగా వెళ్లి ఉండకపోవచ్చనే వాదన కూడా ఉంది. అయితే.. ప్రాంతీయ పార్టీలన్నీ కలవాలి.. దానికోసం హైదరాబాద్ లో మీటింగ్ పెడతానని ఆమధ్య ముంబై టూర్ సందర్భంగా మాట్లాడారు కేసీఆర్. కానీ.. తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ప్రాంతీయ పార్టీల నేతలెవరూ కేసీఆర్ ను ముందుంచి తాము వెనక ఉండాల్సిన అవసరం ఏంటని భావించి ఎవరికి వారు హ్యాండ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు.
ప్రధాని ఆశలతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేద్దామని చూస్తున్న కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదనే చర్చ జరుగుతోంది. ఏదో ఒకటి చేసి బీజేపీ సర్కార్ ను కూల్చుదామని ఆయన వ్యూహాల్లో ఆయన ఉన్నారు. అయితే.. తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చర్యలు కేసీఆర్ ఆశలపై నీళ్లు జల్లేలా ఉన్నాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఈ విషయంలో పోరాటం చేపట్టేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
మోడీ సర్కార్ ను ఎన్నో ఏళ్ల నుంచి ఢీ కొడుతున్నారు మమత. యూపీఏ కూటమిలో టీఎంసీ భాగస్వామి. అయితే.. కాంగ్రెస్ కు గడ్డుకాలం నడుస్తుండడంతో ఇదే ఛాన్స్ అని ఆమె పావులు కదుపుతున్నారు. ప్రాంతీయ పార్టీలను ఒక గూటికి చేర్చాలని చూస్తున్నారు. మరి.. మమత వెనుక కేసీఆర్ నిలబడతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ నేతలతో లింకులు ఉన్న కంపెనీలపై ఐటీ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. కేంద్ర సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మమత అంటున్నారు. ఈ విషయంలో ఆమెకు మద్దతు ప్రకటించి ముందుకెళ్తే.. అవినీతి చేసినట్లు ఒప్పుకున్నట్లేనని అంటున్నారు విశ్లేషకులు. మనకెందుకులే అని గమ్మున ఉండిపోయినా.. రేసులో మమత ముందుకు వెళ్తే కేసీఆర్ జాతీయ రాజకీయాలకు గండి పడినట్లే అవుతుందని చెబుతున్నారు. ఎలా చూసుకున్నా ఆయనకు నష్టమేనని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.