తెలంగాణకు చుక్క నీరు రాకుండ చేసే ప్రాజెక్టులపై కేసీఆర్ స్పందన ఎందుకు అంత చప్పగా ఉంది…? దక్షిణ తెలంగాణ ఏడారి అవుతుంది అంటే రాయలసీమ కూడా బాగుపడాలి అన్న మాటను కేసీఆర్ ఎందుకు బలపర్చాడు…? వెనుకేసుకొచ్చిన ప్రధాని మోడీపై ఒంటికాలితో లేచిన కేసీఆర్ జగన్ పై ఎందుకు నోరు విప్పలేదు…?
ఇప్పుడివే ప్రశ్నలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధాని అంటే వ్యవస్థ, ఆయనో రాజ్యంగబద్ధ వ్యక్తి అంటూ ప్రకటించిన కేసీఆరే… బోగస్ అంటూ విరుచుకపడ్డాడు. కానీ తెలంగాణ ఏడారిగా మారే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై మాత్రం కేసీఆర్ పెద్దగా రియాక్ట్ కాలేదు సరికదా జగన్ తో దోస్తీతో మీ కండ్లు మండుతున్నాయా అంటూ ఎదురు దాడి చేశారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను చూస్తే… జగన్, కేసీఆర్ ముందస్తుగా మాట్లాడుకున్న తర్వాతే ఏపీ సర్కార్ 203జీవోను జారీ చేసి ఉన్నట్లు కనపడుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఓవైపు గోదావరి ప్రాజెక్టులు తెలంగాణ అక్రమంగా నిర్మిస్తుందని.. కృష్ణా నీటి పంచాయితీని గోదావరికి ఏపీ తీసుకెళ్తే కేసీఆర్ మండిపడాల్సింది పోయి కూల్ గా వ్యవహరించటానికి కారణం అదేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుందన్న అంశాలను ప్రస్తావించకపోగా… రాయలసీమ రైతులు కూడా బాగుపడాలి కదా అని కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని చిన్న అంశంగా చూసేది కాదని, కేసీఆర్-జగన్ దోస్తానా ఉంది కాబట్టే కేసీఆర్ ఒక్క మాట కూడా అనలేదని అంటున్నారు. కానీ రాజకీయ కారణాలతో చూస్తే రైతుల భవిష్యత్ శాశ్వతంగా చీకటిగా మారిపోయే ప్రమాదాన్ని దష్టిలో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు.