హైదరాబాద్ బోరబండకు చెందిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్ ఘటన మిస్టరీగా మారింది. ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తలలో ఓ భాగం తీసి పొట్టలో అమర్చినట్లు వైద్యులు గుర్తించారు. అసలు గోవాలో ఏం జరిగిందనే విషయంపై.. ఆ రాష్ట్ర పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోవాలోని అంజున పోలీస్ స్టేషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ తేజస్, కానిస్టేబుల్ హైదరాబాద్‌కి వచ్చారు.
గోవాలో అదృశ్యమైన టెంపో డ్రైవర్ శ్రీనివాస్ ఈ నెల 4న ఇంటికి చేరుకున్నాడు. అయితే, తలకు, పొట్ట భాగంలో కుట్లు ఉన్న శ్రీనివాస్ పరిస్థితిని చూసి.. కంగుతిన్న కుటుంబ సభ్యులు అతడికి ఏదో సర్జరీ చేసినట్టు గుర్తించారు. గోవాలో అసలు ఏం జరిగిందని అడిగినప్పటికి శ్రీనివాస్ పూర్తిస్తాయిలో స్పష్టంగా సమాధానం చెప్పడం లేదని, అతనికి మత్తు మందు ఇచ్చి అవయవాలు తీసుకున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు.
ఈ క్రమంలో బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీన్ సహకారంతో శ్రీనివాస్‌ను నిమ్స్‌కు తరలించారు. చికిత్స అనంతరం శ్రీనివాస్ నిమ్స్ నుంచి గురువారం డిశ్ఛార్జ్ అయ్యారు. శ్రీనివాస్‌కి ఇంట్రాకార్నికల్ ప్రెజర్వేషన్ పద్దతిలో చికిత్స జరిగినట్లు తెలిపారు వైద్యులు. తలలో భాగాన్ని తీసి పొట్టలో ఎందుకు అమర్చారని వివరించారు. అసలు గోవాలో ఏం జరిగిందో తెలియాలని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తనపై ఎవరో దాడి చేశారని, అసలు ఏం జరిగిందో అర్ధం కావడం లేదని బాధితుడు చెబుతున్నాడు.
మార్చి 19న 10 మందిని గోవా తీసుకువెళ్లిన శ్రీనివాస్ 20న సాయంత్రం అదృశ్యమయ్యాడు. దీంతో కూడా వచ్చిన ప్రయాణికులు బోరబండలోని శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని గోవా వెళ్లిన కుటుంబ సభ్యులు అక్కడ శ్రీనివాస్ కోసం గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో.. మార్చి 23న గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతలో తనంతట తానే ఈ నెల 4న ఇంటికి తిరిగి వచ్చాడు శ్రీనివాస్.
అయితే, శ్రీనివాస్ ఇంటికి తిరిగి వచ్చాడనే సమాచారంతో గోవా పోలీసులు కేసు దర్యాప్తు కోసం హైదరాబాద్ వచ్చారు. బోరబండ ఎస్‌ఆర్ నగర్ పరిధిలో శ్రీనివాస్ ఉంటుండటంతో.. ముందుగా వారు ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌కి వెళ్లి సమాచారం ఇచ్చారు. అనంతరం నిమ్స్ ఆస్పత్రికి తరలి వెళ్లారు. శ్రీనివాస్‌కు ఏం జరిగిందనే అంశంపై వైద్యులతో మాట్లాడారు.
గత నెల 23వ తేదీన శ్రీనివాస్ కనిపించట్లేదని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. గోవా వెళ్లి ఫిర్యాదు చేయాలని చెప్పారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అంతే కాదు, ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాస్ పరిస్థితి చూసి అనుమానంతో.. గోవాలో ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లామని కుటుంబసభ్యులు చెప్పారు. అప్పుడు కూడా సంఘటన జరిగిన ప్రాంతం గోవాలో ఫిర్యాదు చేయాలని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారని అన్నారు. తాము మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీసులు స్పందించి ఉంటే ఇప్పుడు శ్రీనివాస్‌కి ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోతున్నారు. తమకు న్యాయం కావాలంటూ వేడుకుంటున్నారు.