దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్బంగా ‘హర్ ఘర్ తిరంగ’ అనే క్యాంపెయిన్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశ పౌరులు అగస్టు 13 నుంచి 15 తేదీల్లో తమ ఇండ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్రం సూచించింది.
దీంతో పాటు పౌరులంతా తమ సోషల్ మీడియా ఖాతాల్లో డీపీలుగా త్రివర్ణ పతాకాన్నా పెట్టుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. ఇప్పటికే ఆయన తన డీపీగా మువ్వన్నెల జెండా ఫోటోను పెట్టుకున్నారు.
ఇది ఇలాఉంటే ఈ నిర్ణయం కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ లో వివాదాస్పదంగా మారింది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి దుకాణదారులు, విద్యార్థులు “డిపాజిట్ ఫీజు”గా రూ. 20 చెల్లించాలని అనంత్ నాగ్, ఉదంపూర్ లలో అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
దీనికి సంబంధించిన ఉత్తర్వులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు రూ.20 ఫీజు చెల్లించాలంటూ జిల్లాలోని పాఠశాలలకు జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్‌ను చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (సీఈఓ) అనంతనాగ్ ఉపసంహరించుకున్నారు.
అదేవిధంగా, డిపాజిట్ డబ్బను కట్టని పక్షంలో బిజ్ హార పట్టణంలోని వ్యాపారుల లైసెన్స్ లను రద్దు చేస్తామంటూ అనంత్‌నాగ్‌లోని మునిసిపల్ కమిటీ బెదిరించారు. దీనికి సంబంధించి వీడియో కూడా వైరల్ అయింది.
దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. దేశ భక్తి అనేది సహజంగా వస్తుందని బలవంతంగా విధిస్తే రాదని జమ్ముకశ్మీర్ మాజీ ప్రధానీ, పీడీపీ నేత మెహబూబ ముఫ్తి, సీపీఎం నేత యూసఫ్ తరిగామి అన్నారు.