ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో నూతన ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8 నుంచి కొత్త పాలసీలను వాట్సాప్ అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే యూజర్లకు ఆ పాలసీలకు చెందిన అగ్రిమెంట్ ను పంపిస్తోంది. దాన్ని ఓకే చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఫిబ్రవరి 8వ తేదీ తరువాత వాట్సాప్ ను యూజర్లు ఉపయోగించుకోలేరు. అయితే వాట్సాప్ అమలు చేయనున్న నూతన పాలసీలపై యూజర్లు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్ ద్వారా ఫేస్‌బుక్ ఇప్పటి వరకు ఎలాంటి ఆదాయాన్ని ఆర్జించలేదు. కానీ నూతన ప్రైవసీ పాలసీ ద్వారా అందుకు ఫేస్‌బుక్ శ్రీకారం చుట్టింది. వాట్సాప్‌లో మనం పంపుకునే మెసేజ్‌లను రీడ్ చేసి ఆ డేటాను వాట్సాప్ తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తోపాటు దానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్‌తో పంచుకుంటుంది. దీంతో యూజర్లకు ఆ డేటాకు తగిన విధంగా యాడ్స్ కనిపిస్తాయి. ఇలా ఫేస్‌బుక్ వాట్సాప్ ద్వారా డబ్బులను సంపాదిస్తుందన్నమాట. అందుకనే కొత్త ప్రైవసీ పాలసీని అందుబాటులోకి తెస్తోంది.
ఇంకా వివరంగా చెప్పాలంటే.. మనం వాట్సాప్‌లో ఎవరికైనా స్మార్ట్ ఫోన్‌కు చెందిన సందేశాలను, వార్తలను, వివరాలను పంపామనుకోండి. వాట్సాప్ ఆ డేటాను సేకరిస్తుంది. ఆ తరువాత మనం ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ లను ఓపెన్ చేస్తే వాటిల్లో మనకు స్మార్ట్ ఫోన్లకు చెందిన యాడ్స్ కనిపిస్తాయి. ఇలా మన డేటాను వాట్సాప్ సేకరిస్తుందన్నమాట. ఈ క్రమంలోనే యూజర్లకు చెందిన ఫోన్ మోడల్, వారు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ స్టేటస్, సిగ్నల్ వివరాలు, టైమ్ జోన్, ఐపీ అడ్రస్, వాట్సాప్ యూసేజ్, పేమెంట్లు, ఇతర లావాదేవీల వివరాలు, స్టేటస్ అప్‌డేట్స్, గ్రూప్ డిటెయిల్స్, ప్రొఫైల్ పిక్చర్లు, అబౌట్ ఇన్ఫో వంటి సమాచారాన్ని వాట్సాప్ ఫేస్‌బుక్‌కు చేరవేస్తుంది. ఈ సమాచారాన్ని సేకరించినా ఫర్వాలేదు, ఓకే.. అని వాట్సాప్ పంపే నోటీస్‌కు అగ్రీ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వాట్సాప్‌లో మనల్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ ట్రాక్ చేస్తుందన్నమాట. దాంతో యాడ్స్ ద్వారా ఆదాయం సంపాదిస్తుంది.
ఇలా వాట్సాప్ మన డేటాను సేకరిస్తుందని తెలియడంతో చాలా మంది వాట్సాప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు వాట్సాప్‌ను తీసేసి అందుకు బదులుగా టెలిగ్రాం, సిగ్నల్ వంటి యాప్‌లను వాడడం మొదలు పెడుతున్నారు. అయితే వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనే ఫీచర్ ఉంటుంది. దీనిపై స్వయంగా వాట్సాప్ గతంలో ప్రకటనలు చేసింది. ఒక యూజర్ మరొక యూజర్‌కు లేదా గ్రూప్‌లో పంపే సమాచారాన్ని అవతలి వారు తప్ప మూడో వ్యక్తి ఎవరూ చూడలేరని, కనీసం వాట్సాప్‌కు కూడా ఆ మెసేజ్‌లు యాక్సెస్ కావని గతంలోనే వాట్సాప్ తెలిపింది. యూజర్లకు పూర్తి భద్రత ఉంటుందని, ప్రైవసీకి పెద్ద పీట వేస్తామని వాట్సాప్ ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది.
కానీ వాట్సాప్ అమలు చేయనున్న నూతన ప్రైవసీ పాలసీ ప్రకారం ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు మంగళం పాడింది. మన డేటాను వాట్సాప్ సేకరిస్తుంది కనుక ఇక ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు, ప్రైవసీకి ప్రాధాన్యత ఉండదు. అసలు అవి వర్తించవు. అందువల్లే యూజర్లకు తీవ్రమైన ఆగ్రహం కలుగుతోంది. అయినప్పటికీ వాట్సాప్ ఈ విషయంలో తగ్గడం లేదు. దీని వల్ల యూజర్లపై ఎలాంటి ప్రభావం పడదని స్పష్టం చేసింది. అయినా కూడా యూజర్లు వాట్సాప్ పై మండిపడుతున్నారు. మరి ఫిబ్రవరి 8 తరువాత ఏం జరుగుతుందో చూడాలి.