వాట్సాప్ ఈ పేరు తెలియని వారెవరూ ఉండరు. మొబైల్ వాడటం తెలియని వారికి కూడా ఈ పేరు సుపరిచితమే. వాట్సాప్ లో ఇప్పటికే ఎన్నో రకాల కొత్త ఫీచర్లు వస్తూ ఉన్నాయి. వినియోగదారులకు అనుగుణంగా వాట్సాప్ లో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటివరకూ పరిమితంగా ఉండే గ్రూపులు ఇప్పుడు పెద్దవి కానున్నాయి.
మరింత మంది సభ్యులు ఒక గ్రూపులో ఉండేందుకు అవకాశం కల్పించనుంది వాట్సాప్.ప్రస్తుతం ఒక గ్రూపులో 512 మంది వరకు ఉండొచ్చట. అయితే త్వరలోనే ఒక గ్రూపులో 1024 మందిని వాట్సాప్ అనుమతించనుంది. ఈ విషయాన్ని వాట్సాప్ కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాబీటాఇన్ఫో వెల్లడించింది. మొదట్లో వాట్సాప్ గ్రూపులో సభ్యుల పరిమితి 256గా ఉండేది. ఆ తర్వాత దాన్ని 512కు పెంచింది. ఇప్పుడు మరోసారి గ్రూపు పరిమితిని పెంచనుంది.
ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో బీటా వెర్షన్ గా ప్రస్తుతం ఇది అమల్లో ఉంది. భారత్ లో వాట్సాప్ కు యూజర్లు ఎక్కువ. ఇప్పటికీ గ్రూపు సభ్యుల పరిమితి విషయంలో టెలిగ్రామ్ అగ్రగామిగా ఉంది. ఒక గ్రూపులో 2 లక్షల మంది వరకు చేరి, చాట్ చేసుకునే సదుపాయం కల్పించింది టెలీగ్రామ్. దీంతో చాలా మంది యూజర్లు టెలీగ్రామ్ ఉపయోగిస్తున్నారు.
దీంతో వాట్సాప్ త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేయనుంది. చాట్స్ ను స్క్రీన్ షాట్స్ తీసుకోకుండా నిరోధించే ఆప్షన్ ను కూడా అభివృద్ధి చేస్తోంది. వ్యూ వన్స్ అనే ఆప్షన్ కింద చాట్ చేస్తే వాటిని స్వీకరించినవారు స్క్రీన్ షాట్ తీసుకోలేరు. ఈ సదుపాయం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.