ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.అందులో భాగంగానే పాత డివైస్‌లకు కూడా సపోర్ట్‌ను నిలిపివేస్తోంది. గతేడాది ఐఓఎస్ 8.0 కన్నా తక్కువ తక్కువ వెర్షన్ కలిగిన యాపిల్ ఐఫోన్లకు, ఆండ్రాయిడ్ 2.3.7 వెర్షన్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్‌ను నిలిపివేసింది. అయితే 2021 నుంచి మరికొన్ని ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
2021 నుంచి ఐఫోన్లలో వాట్సాప్‌ను వాడుకోవాలంటే వాటిల్లో ఐఓఎస్ వెర్షన్ కనీసం 9.0 ఆపైన ఉండాలి. అదే ఆండ్రాయిడ్ ఫోన్లలో అయితే ఓఎస్ వెర్షన్ 4.0.3 ఆపైన ఉండాలి. అలా ఓఎస్ ఉన్న ఫోన్లలోనే వాట్సాప్ పనిచేస్తుంది. ఇక ఐఫోన్ల విషయానికి వస్తే వాటిల్లో ఐఫోన్ 4, 4ఎస్, 5, 5ఎస్, 5సి, 6, 6ఎస్ ఉన్నాయి. అందువల్ల వీటిలో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ పనిచేయదు. అయితే ఐఫోన్ 6ఎస్, 6 ప్లస్, ఐఫోన్ ఎస్ఈలలో ఐఓఎస్‌ను 14.0కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అందువల్ల వీటిల్లో వాట్సాప్ పనిచేస్తుంది. కాకపోతే ఫోన్లను ఆ ఓఎస్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలో అయితే హెచ్‌టీసీ డిజైర్, ఎల్‌జీ ఆప్టిమస్ బ్లాక్, మోటోరోలా డ్రాయిడ్ రేజర్, శాంసంగ్ గెలాక్సీ ఎస్2 ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇవే కాదు, ఇంకా పాతతరం ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఫోన్లలో 2021 నుంచి వాట్సాప్ పనిచేయదు. కానీ ఓఎస్ వెర్షన్‌ను 4.0.3కి అయినా అప్‌గ్రేడ్ చేసుకుంటే వాటిల్లో వాట్సాప్ పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇక యూజర్లు తమ ఫోన్లలో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ను ఉపయోగిస్తున్నారో తెలియకపోతే ఆ విషయాన్ని ఇలా సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు గాను ఐఫోన్ యూజర్లు అయితే ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ అనే విభాగంలో ఉండే ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో ఐఫోన్‌లో వారు వాడుతున్న ఐఓఎస్ వెర్షన్ ఎంత అనేది తెలుస్తుంది. అదే ఆండ్రాయిడ్ లో అయితే ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ ఉండే అబౌట్ ఫోన్ అనే ఆప్షన్‌ను ఓపెన్ చేయాలి. దాంట్లో యూజర్లు తాము వాడుతున్న ఫోన్‌కు చెందిన ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ ఎంత అనేది సులభంగా తెలిసిపోతుంది. ఇలా యూజర్లు తమ ఫోన్లకు చెందిన ఆపరేటింగ్ సిస్టమ్‌ల వెర్షన్‌లను సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఇదంతా గొడవ ఎందుకు అనుకుంటే.. పాత ఫోన్లను తీసేసి కొత్త ఫోన్లను వాడితే చాలు, వాట్సాప్‌ను ఎలాంటి అడ్డంకి లేకుండా ఉపయోగించుకోవచ్చు.
కాగా వాట్సాప్‌లో ఇటీవలే పేమెంట్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐలతో భాగస్వామ్యం అయిన వాట్సాప్.. తన యాప్‌లో పేమెంట్స్ సేవలను అందిస్తోంది.