అసెంబ్లీలో ప్రశ్నించే వారులేకుంటే వారి ఆగడాలను అడ్డుకునే వారు ఉండరని సమావేశాల మొదటిరోజునే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆరోపించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆ ముగ్గురు తప్ప మిగిలిన వారంతా టీఆర్‌ఎస్ వాళ్ళే అని పరిగణించాలన్నారు.
కేసీఆర్‌కి బీజేపీ పేరువింటేనే వణుకుపుడుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అంకెల గారడీతో ప్రజలను మోసం చేశారని.. తన పూర్తి బండారాన్ని ఈటల బయటపెట్టారని వ్యాఖ్యానించారు అరుణ. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం కేసీఆర్ కోల్పోయారని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే ఈ బడ్జెట్ రూపొందించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన ప్రతీ పథకంలో అవినీతి ఉందని.. దాన్ని బయట పెడతామనే భయంతోనే అసెంబ్లీ నుంచి బయటకు పంపించారని విమర్శించారు. 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుతో కేసీఆర్ కు నోటిమాట పడిపోయిందన్నారు.
అంతకుముందు వరకు ఫ్రంట్ పెడతా అని అన్ని రాష్ట్రాల తిరిగిన కేసీఆర్.. 4 రాష్ట్రాల ఫలితాలతో సైలెంట్ అయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు రాజ్యాంగం అంటే గౌరవం లేదని.. అసెంబ్లీలో కనీసం గవర్నర్ ప్రసంగాన్ని పెట్టలేదని మండిపడ్డారు అరుణ.