ప్రగతి భవన్.. అదో మహల్. తెలంగాణను ఏలుతున్న కేసీఆర్ మహారాజు ఉంటున్న నివాసం. అందులో నుంచి ఆయన దర్శనం కావాలంటే ఎప్పుడో అమావాస్య, పౌర్ణమికోసారి జరుగుతుంటుంది. అది కూడా సామాన్యుడికి అనుకుంటే పొరపాటే. మంత్రులో, ఎమ్మెల్యేలో, తనకు కావాల్సిన వారికో ఆ దర్శనభాగ్యం కల్పిస్తుంటారు.
ప్రగతి భవన్ గేటు దాటి లోపలికి వెళ్లడమంటే యుద్ధం చేసినట్లే. అందుకే అంతటి ఎత్తైన గేట్లను, కంచెను కట్టుకున్నారేమో అని అనిపించక మానదు. సామాన్యులు ఎవరైనా తమ గోడు చెప్పేందుకు అటు వైపు వెళ్తే చాలు.. గుంపులు గుంపులుగా ఉండే పోలీసులు చటుక్కున పట్టేసుకుని వ్యాన్ లోకి నెట్టేస్తుంటారు. కనీసం ప్లకార్డు పట్టుకునే స్వేచ్ఛ కూడా ఆ దరిదాపుల్లో ఉండదు.
ఈమధ్యకాలంలో టీచర్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. ప్రగతి భవన్ గేట్ దరిదాపుల్లోకి కూడా వారిని వెళ్లనివ్వడంలేదు. ముందే అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారు. సామాన్యులకే కాదు.. ఒక్కోసారి వీఐపీలకు కూడా ప్రగతి భవన్ గేట్ తెరుచుకోదు. గతంలో చాలామంది సొంత పార్టీ నేతలే గంటలు గంటలు గేట్ ముందు కాచుకుకూర్చున్న పరిస్థితి. కొందరైతే నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు కూడా.
తాజాగా ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నించారు. అయితే ఆయన్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అపాయింట్ మెంట్ లేకుండా లోపలికి అనుమతించమని చెప్పారు. సీఎంను కలిసేందుకు వచ్చానని.. కనీసం కేటీఆర్ ను అయినా కలుస్తానని జేసీ వాగ్వాదానికి దిగారు. పోలీసులు కుదరదని చెప్పేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో తమ వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. కొంత దూరం వెళ్లాక దిగి తన కారులో ఇంటికి వెళ్లారు జేసీ దివాకర్ రెడ్డి.
జేసీ అపాయింట్ మెంట్ తీసుకోకపోవడం తప్పే అనుకుందాం. మరి.. టీఆర్ఎస్ నేతలు చేస్తోందేంటి? మాట్లాడితే ఢిల్లీ వెళ్తారు.. అపాయింట్ మెంట్ తీసుకునే వెళ్తున్నారా? అక్కడకు వెళ్లాక ప్రయత్నించడం లేదా? వీఐపీల సంగతి సరే.. సామాన్యులు సీఎంను కలవాలంటే కుదిరే పనేనా? టీచర్ల విషయమే చూడండి. 317 జీవోను వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా ప్రగతి భవన్ ముందు నిరసనలు చేస్తున్నారు. ఒక్క అపాయింట్ మెంట్ ఇవ్వమని కేసీఆర్ ను అడుగుతున్నారు. కానీ.. సీఎం మాత్రం వారి వైపు చూడడం లేదు. ఒక్క టీచర్లే కాదు.. ఫీల్డ్ అసిస్టెంట్స్, నర్సులు, భూ కబ్జాల బాధితులు.. ఇలా ఒక్కరేంటి ఎంతో మంది ఇన్నేళ్లలో ఎన్నో నిరసన కార్యక్రమాలు ప్రగతి భవన్ ముందు నిర్వహించారు. వారి బాధను కూడా కేసీఆర్ తెలుసుకుందామని ఆలోచించలేదు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఆయనకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.