– ఎన్నికల మూడ్ లోకి బీఆర్ఎస్, కాంగ్రెస్
– అధికార పార్టీ సంక్షేమ మంత్రం
– కర్ణాటక పైనే కాంగ్రెస్ ఆశలు
– సోషల్ మీడియానే నమ్ముకున్న బీజేపీ
– ఎన్నికల కమిషన్ ఎత్తులను చిత్తు చేసేలా ప్లాన్స్
– కేసీఆర్ మార్క్ ఎన్నికల డేట్ ఫిక్స్?
తెలంగాణతో పాటు జరిగే ఎలక్షన్స్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్. భారత రాష్ట్ర సమితి అంటూ జాతీయ రాజకీయాలు నడుపుతున్నారు కేసీఆర్. అయితే.. అంతకుముందే వచ్చే తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలనేది బీఆర్ఎస్ ప్లాన్. ఓట్ బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ కూడా అందుకు సై అంటోంది. కానీ, బీజేపీ ఒక్కటే ఎన్నికలను ఎలా అలస్యం చేయాలి లేదా ఇరుకున పెట్టాలి అన్న వాటిపై ఆలోచిస్తోందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే సోషల్ మీడియాలో ప్రచారం తప్ప.. ఓట్ బ్యాంకు క్రియేట్ కావడం కష్టమని ఆపార్టీ అనుబంధ సంస్థలు అంచనాలకు వస్తున్నట్టుగా చెబుతున్నారు. దీంతో కేసీఆర్ ఎప్పుడు ఎలక్షన్ అంటారనేది కీలకంగా మారింది.
అక్టోబర్ లో నోటిఫికేషన్ వస్తే.. అడ్డుకోవడమేనా?
జనవరిలో కొలువు దీరే ప్రభుత్వానికి అక్టోబర్ లోనే ఎన్నికల కూత మొదలవుతోంది. 45 రోజుల ముందు నోటిఫికేషన్ వస్తుంది. ఆ మరుసటి 6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్టు వార్ జరుగుతోంది. అయితే.. రాష్ట్రంలో కూడా సార్వత్రిక ఎన్నికలతో కలిసి నిర్వహిస్తే.. లాభమా.. నష్టమా అని బీజేపీ సర్వేలు చేయిస్తోందట. మోడీ మేనియా అసెంబ్లీ ఎన్నికలకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నట్టుగా టాక్. ఈక్రమంలోనే రెండు ఎన్నికలు ఒకే సారి పెట్టించాలని లేఖలు రాయించే ప్లాన్స్ లో ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుని పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి మరో 6 నెలలు అసెంబ్లీని పొడిగించే ప్లాన్ లో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇలా అయితే బీఆర్ఎస్ ను కేవలం తెలంగాణకే పరిమితం చేయవచ్చనేది కమలనాథుల ప్లాన్ గా చెబుతున్నారు విశ్లేషకులు. మరిన్ని అవినీతి స్కాంలను బయటపెట్టి ప్రచారం చేయవచ్చని అనుకుంటున్నారట. తెలంగాణతో పాటు జరిగే 4 రాష్ట్రాలకు ఎన్నికలు పొడిగిస్తారా.. లేదా.. అనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.
కేసీఆర్ స్టైల్ లో ప్లాన్ బీ రెడీ!
టైం చూసుకుని ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు అన్నట్లుగా వ్యవహరించడం కేసీఆర్ స్టైల్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు రావాలో తానే ఫిక్స్ చేస్తానని అనుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తెర వెనుక చాటు వ్యవహారాన్ని ఆయన పసి గట్టారని అంటున్నారు విశ్లేషకులు. దేశ రాజకీయాల్లో ఉండాలంటే.. తెలంగాణ గెలవాలి. అందుకు 180 రోజుల కంటే ఒక్క రోజు ముందైనా అసెంబ్లీని రద్దు చేసి తప్పని పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించేలా చేయాలని ఆయన ప్లాన్ గా అంచనా వేస్తున్నారు. జూలై 14 కల్లా ఏదైనా జరగొచ్చని అంటున్నారు. జనవరి 16న ఏర్పాటైన ప్రభుత్వం 180 రోజులకు ఒక్క రోజు ముందు మళ్లీ అసెంబ్లీ కావాలి. అందుకు ఒక్క రోజునైనా వాడుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు.
ప్రజల మన్ననలు ఎలా?
గత రెండు పర్యాయాలు ఏదో ఒక కొత్త పథకాలు, వరాలతో గట్టెక్కారు సీఎం కేసీఆర్. ఇప్పుడు మళ్లీ ప్రజల మన్ననలను పొందాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే మహిళలకు బస్సులో ఫ్రీ రవాణా, వారి పేరు మీద భూముల రిజిస్ట్రేషన్ చేస్తే 1 శాతం పన్ను తగ్గింపు, మెట్రో లేదా రైలు ప్రయాణాల్లో రాష్ట్రం తరుఫున 50 శాతం ఖర్చులు ఇచ్చేలా? పెన్షన్ 3 వేలకు ఇస్తామని చెబుతూ.. అణగారిన వర్గాల కోసం దళిత బంధు లాంటి పథకాలను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టేందుకు రెడీ అయ్యారని అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ని పాలసీలను రూపొందించి, ఆదాయ మార్గాన్ని రాబట్టేందుకు చీఫ్ సెక్రెటరీగా నియమించారని ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్ ప్లాన్స్.. కానీ!
ప్రియాంక గాంధీ పర్యటన, విద్యార్థి, నిరుద్యోగ సభలు, రేవంత్, భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ కొంత మెరుగైందని అంటున్నారు రాజకీయ పండితులు. ఓట్, లోకల్ లీడర్స్ తో నిత్యం ఫాంలో ఉండే కాంగ్రెస్ ఎప్పుడు ఎన్నికలు జరిగినా 90 సీట్లలో గట్టి పోటీ ఇస్తుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 2వ స్థానంలో ఉంటుంది. 35 నుంచి 40 సీట్లు ఈజీగా గెలిచే దమ్ముందని ఆపార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లితో పాటు పలువురు కీలక బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వస్తే.. ప్రభుత్వం మనదే అంటూ కొత్త డిక్లరేషన్స్ తో ప్రజల ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. కానీ, ఎలక్షన్స్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? కేసీఆర్ పంతం నెగ్గుతుందా? అనే దానిపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది.