మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పక్కా మాస్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న రిలీజ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో, చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ..తన సోదరుడు పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని తెలిపారు. పవన్ కు ఇప్పటి వరకు సొంతిల్లు కూడా లేదని వెల్లడించారు.
ప్రజలకు మేలు చేయాలన్న సత్ససంకల్పంతో రాజకీయ ప్రక్షాళనకు పూనుకున్నాడని, కానీ కొంతమంది పవన్ ను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ పై విమర్శలు వింటున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుందని, పవన్ ను విమర్శించిన వాళ్లతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుందని తెలిపారు.
పవన్ కల్యాణ్ ను ఓ బిడ్డలా భావిస్తానని, తమ కుటుంబంపై అతడికి ఎంతో ప్రేమ అని చిరంజీవి పేర్కొన్నారు. మరో వైపు బాలకృష్ణ మూవీ వీరసింహారెడ్డి కూడా జనవరి 12 న విడుదల కానుంది. దీంతో ఈ రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో రిలీజ్ అవుతుండటం, రెండూ ఒకే బ్యానర్ లో వస్తుండడంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫైట్ ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.