టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే కొత్త సచివాలయం డోమ్ లు కూల్చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సచివాలయం భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదన్నారు.
అధికారంలోకి వచ్చాక సచివాలయంలో మళ్లీ మార్పులు తెస్తామన్నారు. రోడ్డు పక్కన మందిరాలు, మసీదులను కూలుస్తున్న ప్రభుత్వానికి దమ్ముంటే పాతబస్తీ నుంచి కూల్చివేతలు మొదలు పెట్టాలన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే తాజ్ మహల్ నమునాలో సచివాలయం నిర్మించారన్నారు. ఎంఐఎం,బీఆర్ఎస్ రెండూ ఒకటే అని అందుకే తాజ్ మహల్ కన్నా అద్బుతంగా సచివాలయం నిర్మించారని అసద్ కేసీఆర్ ను ప్రశంసిస్తున్నారని ఫైర్ అయ్యారు.
జనం గోస – బీజేపీ భరోసాలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్ పల్లి లో 77, 78,79 వార్డుల పరిధిలో ప్రారంభమైన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు. ప్రగతి భవన్ ను ప్రజాదర్భార్ లా మారుస్తామన్నారు. తెలంగాణలో నిజాం వారసత్వ మరకలను సమూలంగా తుడిచివేస్తామని బండి అన్నారు. అసెంబ్లీ లో బీఆర్ఎస్, ఎంఐం కలిసి నాటకం ఆడుతున్నాయని విమర్శించారు.
కూకట్ పల్లిలో పేదల భూములను కబ్జా చేసిన వారిపై కేసులు పెడుతున్నామన్నారు. అయితే రాష్ట్రంలో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పెడతామని,ఎక్కడ ఎన్నికలు జరిగినా జనం బీజేపీ కి పట్టం కడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ మూర్ఖత్వ పాలనను ప్రజలకు వివరించేందుకే ఈ మీటింగ్ లు అని.. అదే విధంగా మోదీ పాలనా విజయాలను వివరిస్తామని ఆయన అన్నారు.
సీఎం కేసీఆర్ ఫాం హౌస్, ప్రగతి భవన్ కు పరిమితం అయ్యారని..ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేరని..ఈ రోజుకి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదన్నారు. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్ నుంచే వస్తోందని.. హైదరాబాద్ ను ఏ మేరకు అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దుర్మార్గులు, దుష్టులు ఇద్దరు ఏకమై బీజేపీ కి మేయర్ పదవి రాకుండా చేశారని.. మూతపడ్డ ఫైనాన్స్ దుకాణానికి కొత్త పేరు పెట్టి తెరిచినట్లుగా బీఆర్ఎస్ వ్యవహారం ఉందని.. కేసిఆర్ ఎక్కడి కి వెళ్ళినా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు బండి సంజయ్. మోదీ ప్రభుత్వం 3 కోట్ల ఇండ్లు ఇచ్చింది…. కేసీఆర్ ఎంత మందికి డబుల్ బెడ్రూం లు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.