1986 లో 75 అడుగులు దాటి వచ్చిన గోదావరి వల్ల భద్రాద్రి చిగురుటాకులా వణికిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఈ సమస్యకు పరిష్కారంగా కరకట్ట నిర్మాణానికి పూనుకున్నారు. 75 అడుగుల వరదని తట్టుకునేలా కరకట్ట ఉండాలని ఆదేశించారు. 1986లో కరకట్ట నిర్మాణాన్ని తలపెడితే 2000 సం.లో పూర్తి అయ్యింది. అదే నిర్మాణం ఇప్పటివరకు భద్రాచలాన్ని కాపాడుతూ వచ్చింది. కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైనప్పటి నుంచి ప్రఖ్యాత పాపికొండలతో సహా.. భద్రాచలం ఉనికికి తీవ్ర ప్రమాదం ఏర్పడింది.
ఇప్పుడు 60 అడుగుల వరద దాటితే రామాలయంతో సహా లోతట్టు ప్రాంతాలు జలమయమౌతాయి. కానీ అక్కడ పోలవరం పూర్తి అయితే నిత్యం 40 నుంచి 45 అడుగుల నీళ్లు బ్యాక్ వాటర్ రూపంలో ఇక్కడ ఉంటాయి. ఇది అత్యంత ప్రమాదకరం. కాళేశ్వరం సహా పైనుంచి వచ్చే ఇతర ప్రాజెక్టుల నుంచి వచ్చే నీళ్లు స్వేచ్ఛగా ముందుకి పోకుండా పోలవరం కట్టడం వల్ల వరద వెనక్కి వచ్చి భద్రాచలాన్ని ముంచే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరించినా రెండు ప్రభుత్వాలూ పట్టించుకోవటం లేదు.
2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోలవరం కు వచ్చిన సందర్భంలో 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ఏడేళ్లు అయినా ఇంకా నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు గోదావరికి 70 అడుగులు మించి వరదొచ్చింది. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. ఈ సందర్భంలో పోలవరం వచ్చిన సీఎం మరోమారు హామీల వర్షం కురిపించారు. ఇంటికో పదివేలు, 20 కేజీల బియ్యం, సింగరేణితో కలిసి 1000 కోట్లు ఖర్చు పెట్టి రామాలయం, భద్రాచలం, బూర్గంపాడు వంటి ప్రాంతాల అభివృద్ధి, ముంపు ప్రాంతాల వారికి ఎత్తైన చోట పక్కా ఇళ్లు అని సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చారు .
అయితే 2015 లో ఇచ్చిన 100 కోట్ల రూపాయల హామీనే ఇంకా తీర్చలేదు. ఇప్పుడు 1000 కోట్ల హామీ.. నమ్మేదేనా?..అయితే ఈ సమస్యకి పరిష్కారం లేదా?అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న కరకట్ట ఎత్తు ఇంకో ఐదు మీటర్లు పెంచాలి. కరకట్టను నెల్లిపాక వరకూ పొడిగించాలి. నదిలో పేరుకుపోయిన సిల్టుని తొలగించాలి. ఇవి అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యేవి. వీటితో ముంపు సమస్యకు పరిష్కారం దొరుకుతోంది.
అటు పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కూడా అనేక అభ్యంతరాలు ఉన్నాయి. కేంద్రం ఈ రామాలయాన్ని గుర్తించి తన ప్రసాద్ స్కీమ్ లో చోటు కల్పించింది. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి దీనిపై శ్రద్ధ వహించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భద్రాచలాన్ని, రాములోరిని కాపాడాలని భద్రాచలం ప్రజానీకం కోరుకుంటున్నారు.