– ముందస్తుగా సంక్షేమంపై సర్కార్ నజర్
– అందరికీ ఇళ్లు అందేలా ప్లాన్
– కానీ, జర్నలిస్టులపై సవతి ప్రేమ
– సుప్రీం తీర్పిచ్చి వంద రోజులు అయినా మౌనం
– జర్నలిస్టుల ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు?
– ఎన్నికల ముందైనా కలం వీరుల కల నేరవేరేనా?
క్రైంబ్యూరో, తొలివెలుగు:దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుకున్నట్లుగా ఉంది జర్నలిస్టుల పరిస్థితి. ఇన్నాళ్లూ సుప్రీం కోర్టుపై నెపంతో జర్నలిస్టుల ఇండ్లపై నిర్ణయం తీసుకోలేదు. కానీ, సీజేఐగా జస్టిస్ ఎవ్వీ రమణ ఉన్నప్పుడే చారిత్రక తీర్పు వచ్చింది. 100 రోజులు దాటింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ, ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. జవహర్ లాల్ నెహ్రూ సొసైటీకి పేట్ బషీర్ బాగ్ భూమి అప్పగిస్తున్నట్లు జీవో ఇవ్వలేదు. 14 ఏళ్ల క్రితమే 2 లక్షల చొప్పున చెల్లించిన కుటుంబాలు ఆ జాగాపైనే ఆశలు పెట్టుకున్నాయి. సొంత స్థలం వస్తుందని ఎదురుచూసీ చూసీ ఇప్పటికే 40 మందికి పైగా జర్నలిస్టులు చనిపోయారు. సుప్రీం తీర్పుతో ఉత్సాహంగా ఉన్నా.. కేసీఆర్ ప్రభుత్వం తీరు నీరుగార్చేలా ఉందంటున్నారు జర్నలిస్టులు. ముందస్తుకు వెళితే క్లియర్ చేసి వెళ్తారా? లేక మళ్లీ గెలిచాక చూద్దాంలే అంటూ మాటలతో సరిపెడతారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కొంతమంది జర్నలిస్టులు రిటైర్డ్ అయిపోయి.. ఇంటి జాగా కోసమే వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
జూబ్లీహిల్స్, నాన్ సొసైటీ వారికి న్యాయం ఎప్పుడు?
జర్నలిస్టులకు ఇళ్లు లేదా స్థలం ఎది ఇచ్చినా.. అందరికీ ఒకేసారి వచ్చేలా ఇస్తారని యూనియన్ నాయకులు, కేసీఆర్ సన్నిహితులు నాన్ సొసైటీ సభ్యులకు చెప్పుకుంటూ వస్తున్నారు. ది జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీకి గోపన్ పల్లిలో 9 ఎకరాల 18 గుంటల భూమి ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ స్థలాన్ని వెనక్కి తీసుకునేందుకు నోటీసులు ఇచ్చింది. ఆ స్థలంపై సొసైటీ కోర్టులో ఫైట్ చేస్తోంది. అయితే.. సొసైటీలో మరో 12 వందల మంది వరకు నాన్ అలాటీస్ ఉన్నారు. ఇంకా అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. కానీ, స్పెషల్ ఆఫీసర్ పేరుతో అక్కడ జర్నలిస్టులకు స్థానం లేకుండా చేస్తున్నారు. త్రిసభ్య కమిటీ వేసి పనికొచ్చే పని జరగకపోవడంతో కొంత మంది వ్యవహారం యూనిటీని దెబ్బతీసింది. ఇది ప్రభుత్వం దగ్గర జర్నలిస్టులను పలచన చేసేలా చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఇక నాన్ సొసైటీ వారయితే సొసైటీ పెట్టాలని నాలుగేళ్ల క్రితం మీటింగ్ పెట్టుకున్నారు. తాజాగా సుప్రీం తీర్పు తర్వాత సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు.
తనదైన శైలిలో సీఎం హామీలు!
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేసీఆర్ ఏ ఎన్నికలు వచ్చినా.. అక్కడికి వెళ్లి ఏడాదిలో పూర్తి అవుతాయంటూ హామీలిస్తూ వస్తున్నారు. ఏదైనా న్యూస్ కవరేజీకి వెళితే సీఎం మీకు ఇళ్లు ఇచ్చారు తమకే దిక్కు లేదని ఎంతోమంది అడుగుతుంటారు. కానీ, హామీలిచ్చినంత ఈజీగా అమలు జరగదు కదా. కేసీఆర్ చెప్పిన ఏరోటికాడ ఆ మాటలు ఎప్పుడు నెరవేరతాయో అని జర్నలిస్టులు ఎంతో ఆశగా ఎదరుచూస్తున్నారు.
రోజురోజుకీ దీనావస్థ!
జర్నలిస్టుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనాతో చాలామంది జీవితాలు రోడ్డు పాలయ్యాయి. యజమాన్యాలు నెలల కొద్ది జీతాలు పెండింగ్ లో పెడుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యూవర్ షిప్ వార్తలతో సతమతం అవుతూ.. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలుసుకుని జల్లడ పట్టి వార్తలు ఇవ్వడం ఇప్పుడు పెను సవాల్ గా మారుతోంది. ఇలాంటి సమయంలో మరోసారి ఎన్నికలు హామీగా జర్నలిస్టుల ఇళ్ల జాగా కాకుండా.. ఈసారి నేరవేర్చాలని ప్రతి వర్కింగ్ జర్నలిస్టు కోరుకుంటున్నాడు.