– కేటీఆర్ కు సీఎం పదవి ఇప్పట్లో లేనట్టేనా
– రాజకీయ పండితులు ఏమంటున్నారంటే…
కేసీఆర్ త్వరలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. అందుకోసం రాష్ట్రంలో సర్వాధికారాలు కేటీఆర్ కు కట్టబెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం, బడ్జెట్ పై విమర్శలు, కొత్త రాజ్యాంగం కామెంట్లు ఇందుకు నిదర్శనంగా మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. జాతీయ స్థాయిలో రాజకీయ ప్రయోజనాలు ఆశించి కేసీఆర్ ఈ విమర్శలు చేస్తున్నారని విశ్లేషణలు చేస్తున్నాయి.
అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నట్టు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా దుబ్బాక ఎన్నికల నుంచి మొదలైన ఎదురుగాలి రోజురోజుకూ బలపడుతున్నదని రాజకీయ పండితులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతుండగా నిరుద్యోగుల ఆత్మహత్యలతో అది తారాస్థాయికి చేరుతోందని వివరిస్తున్నారు.
ఇక ఇన్ని రోజులుగా రాష్ట్ర నేతల నుంచి మాత్రమే కేసీఆర్ విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నారు. తాజాగా కొత్త రాజ్యాంగం రాయాలంటూ కొత్త వాదన తీసుకువచ్చారు. దీంతో ఆయనపై జాతీయ స్థాయిలో పలు పార్టీల నేతలు, మేథావులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశ ప్రధాన మంత్రిపై అంత తీవ్రంగా నోరుపారేసుకోవడం ఏంటంటూ కడిగిపారేస్తున్నారు. దీంతో అటు ఆయనకు జాతీయ స్థాయిలో నెగెటివ్ ఇమేజ్ పెరిగిపోతోందని రాజకీయ పండితులు వెల్లడిస్తున్నారు.
మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అంత ఆషామాషి కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు 40 సీట్లు మాత్రమే వస్తాయంటూ ప్రభుత్వం ఇంటర్నల్ సర్వేలో వెల్లడైందంటూ వస్తున్న వార్తలు చూస్తే ఈ విషయం అర్థమవుతోందని విశ్లేషిస్తున్నారు. మరో వైపు విజయం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై ఆధారపడుతున్నారంటూ వస్తున్న వార్తలు టీఆర్ ఎస్ పరిస్థితికి అద్దం పడుతోందంటున్నారు.
కాగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ వ్యూహాలే ప్రస్తుత పరిస్థితుల్లో బెడిసి కొడుతున్నాయని ఇలాంటి సమయంలో కేటీఆర్ కు అధికారాన్ని అప్పగిస్తే పరిస్థితులు మరింత జటిలం అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అనుకుంటారని అందుకే కేసీఆర్ సైతం రాష్ట్రానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తారని వివరిస్తున్నారు. అందుకే యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం అన్న ఆయన ఆ తర్వాత దానిపై వెనక్కు తగ్గినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకే ఆయన ప్రాధాన్యత ఇస్తారని, ఇప్పట్లో కేటీఆర్ కు సీఎం అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతున్నారు.