విద్యార్థులతో ప్రధాని మోడీ నిర్వహిస్తున్న ‘ పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ఎన్సీపీ స్వాగతించింది. అదే సమయంలో ‘ పరేషాన్ పే చర్చ ( ప్రజా సమస్యలపై చర్చ)’ ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
ఎన్సీపీ ప్రతినిధి క్లైడో క్రాస్టో మాట్లాడుతూ.. ‘ పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని చూడాలంటూ ప్రజలను కొందరు సెలబ్రిటీలు కోరారని తెలిపారు. ప్రజల కష్టాలపైనా చర్చలు జరపడంపై ప్రధానిని వారు ఎప్పుడు ప్రశ్నిస్తారా? అని తాను ఆశ్చర్యంగా చూశానని తెలిపారు.
‘ పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. ఆ ఒత్తిడిని తగ్గించేందుకు విద్యార్థులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని పెంచినందుకు ప్రధానికి ధన్యవాదాలు. కానీ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు, సామాన్య ప్రజల ఆందోళనలపై మాట్లాడేందుకు ‘ పరేషాన్ పై చర్చ’ ను ఆయన ఎప్పుడు నిర్వహిస్తారో?’ అని అన్నారు.
దేశంలో ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగిపోతున్నాయని అన్నారు. నిరుద్యోగం దేశంలో ఆందోళన కలిగించే అంశంగా మారిందన్నారు. ధరల పెరుగుదల వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందుల గురించి సెలబ్రిటీలు ఎప్పుడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు.