వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి, ఒకరు పెళ్లి చేసుకున్న వెంటనే మరొకరు వెంటనే పెళ్లి చేసుకోవాలనే రూలేం లేదు. కానీ మీడియా మాత్రం ఆ కోణంలోనే చూసింది. కాజల్ పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు తల్లి కూడా కాబోతున్న నేపథ్యంలో.. నీ పెళ్లెప్పుడు అంటూ తమన్నా వెంటపడింది. ఇప్పటికే దీనిపై ఓసారి స్పందించిన మిల్కీబ్యూటీ, ఈసారి మరింత స్పష్టంగా తన పెళ్లిపై ప్రకటన చేసింది.
మరో రెండేళ్ల వరకు పెళ్లి చేసుకోనంటూ కరాఖండిగా ప్రకటించింది 32 ఏళ్ల తమన్న. దయచేసి పెళ్లి గురించి తనను ప్రశ్నించొద్దని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందంటూ సూటిగా రియాక్ట్ అయింది. తమన్న ఇలా తన పెళ్లిపై ఇంత ఓపెన్ గా రియాక్ట్ అవ్వడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం ఆమె కెరీర్ వెలిగిపోతోంది.
వెంకటేష్ సరసన ఎఫ్3 సినిమాలో నటిస్తోంది తమన్న. దీంతో పాటు గని సినిమాలో ఓ ఐటెంసాంగ్ చేసింది. మరోవైపు గుర్తుందా శీతాకాలం అనే సినిమాను పూర్తిచేసింది. చిరంజీవి సరసన భోళాశంకర్ సినిమాలో నటించబోతోంది. అటు కన్నడలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటించబోతోంది.
కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉంది కాబట్టే పెళ్లిపై దృష్టిపెట్టలేదు తమన్న. ఓవైపు వయసు పెరుగుతున్నప్పటికీ కెరీర్ కే ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాకు కోటిన్నర నుంచి 2 కోట్ల రూపాయల వరకు తీసుకుంటోంది. ఈమధ్య ఈమెకు యాడ్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి.