- ముదిరిన తాండూరు చైర్ పర్సన్ వివాదం
- తాండూరు ఛైర్ పర్సన్ సీటు వివాదం
- ఛైర్ పర్సన్ సీటు విషయంలో సందిగ్ధత
- ఎమ్మెల్సీది నమ్మకద్రోహం..!
తాండూరు మున్సిపల్ కుర్చీ ఇప్పుడు గొడవలకు దారి తీస్తోంది. అయితే మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న.. ఒప్పందం ప్రకారం రాజీనామా చేయకపోవడంతో రాజకీయ దుమారం రేగుతోంది. పదవి రాజీనామా చేయించడంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తూ నమ్మకద్రోహం చేస్తున్నాడని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఒప్పందాలపై మీడియా సమావేశం నిర్వహించారు.
గత మున్సిపల్ ఎన్నికల అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి టిఆర్ఎస్ లోనే పోటాపోటీ నెలకొనడంతో తాండూరు అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ ఎంపీ రంజిత్ రెడ్డి చెప్పిన విధంగా నడుచుకోవడం జరిగిందని అన్నారు. స్వప్నను మొదట మున్సిపల్ చైర్ పర్సన్ చేయాలని పేర్కొనడంతో పెద్దలపై ఉన్న గౌరవంతో ఒప్పుకోవడం జరిగిందని అన్నారు. ఒప్పందం ప్రకారం ఈ నెల 26వ తేదీ ని ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పదవీకాలం పూర్తయిందని ఆమె రాజీనామా చేయాల్సిందని తెలిపారు. తాను ప్రతిపాదించిన వైస్ చైర్ పర్సన్ దీప ను మున్సిపల్ చైర్ పర్సన్ గా చేయవలసి ఉందని అన్నారు. కానీ గడువు పూర్తయినా కూడా రాజీనామా చేయకపోవడం పై ఆంతర్యం ఏముంది అని ప్రశ్నించారు .
ఈ విషయంపై ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పెద్దమనిషిగా ఉండి కూడా ఒప్పందం ప్రకారం నడుచుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించక నిర్లక్ష్యం వహిస్తూ నమ్మకద్రోహం చేస్తున్నారని అన్నారు. పలుమార్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ చేసినా కూడా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందించడం లేదని.. తాను కూడా ఈ విషయంపై ఫోన్ చేశానని అన్నారు. ఇప్పుడు కూడా మీడియా ముందు ఫోన్ చేస్తున్న కూడా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై రాజకీయ పరిణామాలు ఏవో ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న అధిష్టానం నిర్ణయించిన ప్రకారం రెండు రోజుల్లో రాజీనామా చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడ్డారు. రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయకుంటే తాము ఎలా చేయించాలో తెలుసు అని అన్నారు. క్రమశిక్షణ పార్టీ గల టిఆర్ఎస్ పార్టీ మనదని దానికి అనుగుణంగా నేర్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప, కౌన్సిలర్లు రాఘవేందర్, అనిత గౌడ్, ఎర్రం వసంత, సింధుజ, సంగీత ఠాగూర్, కో ఆప్షన్ నెంబర్ సారంగా సీనియర్ నాయకులు నర్సింహులు డాక్టర్ సంపత్ యువ నాయకులు సంతోష్ గౌడ్ ఇంతియాజ్ రమేష్ శివానంద్ తదితరులు ఉన్నారు.