– దళిత సీఎం, మూడెకరాల రూట్ లోనే..
– దళిత బంధు మర్చిపోయినట్టేనా?
– ఉద్యోగ నోటికేషన్లు ఇస్తారా? లేదా?
– ముందస్తుకు వెళ్తే.. అన్నీ అటకెక్కడమేనా?
మాయల మరాఠీ.. జిమ్మిక్కుల బాస్.. మోసాలకు కేరాఫ్.. ఇలా తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇప్పటిదాకా అనేక బిరుదులు ఇచ్చేశారు ప్రతిపక్ష నేతలు. ఆయన ఇచ్చిన హామీలను.. అమలు చేసిన తీరును బట్టి ఆయా సందర్భాల్లో ఇలాంటి పేర్లతో పిలవడం కామన్ అయిపోయింది. దళిత సీఎం మొదలుకొని.. ఇప్పటి ఉద్యోగ ప్రకటన దాకా కేసీఆర్ చెప్పిన దానికి.. వాస్తవంగా జరిగిన దానిని బేరేజు వేసి సెటైర్లు వేస్తుంటారు. ఈమధ్యే అసెంబ్లీ సాక్షిగా 80వేల ఉద్యోగాల ప్రకటన చేశారు కేసీఆర్. కానీ.. ఇది ప్రతీ ఎన్నికలకు వినిపించే స్టంట్ గానే జనాలు చూస్తున్నారంటే.. ఆయనపై జనాల్లో ఉన్న అభిమానం ఏంటో తేలిపోయిందని అంటున్నారు రాజకీయ పండితులు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా 50 వేల ఉద్యోగాలు అదిగో.. ఇదిగో అని చెప్పడం కేసీఆర్ కు అలవాటే. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల ప్రసంగాలను ఓసారి తిరగేస్తే ఇది స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే.. ఈసారి ఏకంగా 80 వేల ఉద్యోగాలు అని చెప్పారు. ఇంకో లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ సంగతి పక్కనపెడితే.. తాజాగా ప్రకటించిన 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయనేది క్లారిటీ లేదు. గత ప్రకటనల మాదిరిగానే ప్రస్తుతానికీ ఇదీ మిగిలిపోయింది. ఈ సందర్భంగా విశ్లేషకులు ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే.. దళిత బంధు.
హుజూరాబాద్ బైపోల్ సందర్భంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు కేసీఆర్. ఈటల ఓటమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టూరు. పైగా హుజూరాబాద్ నుంచే పైలట్ ప్రాజెక్ట్ పేరుతో శ్రీకారం చుట్టారు. తీరా ఎన్నికల సమయం దగ్గర పడగానే ఈసీ ఆంక్షలతో పథకం అమలు ఆగిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాతి రోజే అమలు చేస్తామన్న కేసీఆర్ అదిగో ఇదిగో అంటూ నెట్టుకొస్తున్నారు. 130కి పైగా రోజులు దాటిపోయాయి గానీ.. లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు.
గతంలో మాదిరిగానే దళిత సీఎం, మూడెకరాల హామీలలా ఈ పథకం కూడా అటకెక్కిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ నోటిఫికేషన్లపైనే చర్చ నడుస్తుండగా.. దళిత బంధును చాలావరకు మర్చిపోయిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు విశ్లేషకులు. ఒకవేళ కేసీఆర్ కు ముందస్తు ఆలోచన ఉంటే గనక ఉద్యోగాల ప్రకటన కూడా అటకెక్కడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. నోటిఫికేషన్లు ఇచ్చినా ఉద్యోగం ఇచ్చేసరికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇక అంతే సంగతులు అని అంటున్నారు విశ్లేషకులు.