- వారు చెప్పిందే వేదం… చేసేదే శాసనం..
- చిన్న పార్టీలకు మోడీ, షా ధ్వయం ఝలక్
- భయం గుప్పిట్లో ప్రాంతీయ పార్టీలు
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రం ఉంటాయి. ఒకప్పడు కమల దళం సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న మిత్రపక్షాలు చాలావరకు ఇప్పుడు ఆ కూటమిలో లేవు. కలిసి నడుద్దాం.. కలిసి గెలుద్దాం అన్నది ఒకనాటి భారతీయ జనతా పార్టీ నినాదం. చిన్నపాయగా మొదలైన బీజేపీ తర్వాతకాలంలో మహాప్రవాహంగా మారి, నేడు దేశంలోనే అతిపెద్దపార్టీగా రూపుదాల్చడం వెనుక ఎంతో కృషి దాగి ఉంది. అనేక ప్రాంతీయశక్తులు, సంప్రదాయవాదులు అండదండలనిస్తూ పార్టీ మహావృక్షంగా ఎదగడానికి, వేళ్లూనుకోవడానికి దోహదం చేశారు. అయితే ఒకప్పడు కమల దళం సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న మిత్ర పక్షాలు చాలావరకు ఇప్పుడు ఆ కూటమిలో లేవు.
కేంద్ర మంత్రివర్గంలో బీజేపీయేతర పార్టీలకు చెందిన మంత్రులు, ఇద్దరు ముగ్గరు కంటే లేరు. అటు ఎన్డీఏలో మిగిలిన పార్టీలను కూడా వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఒకప్పుడు, బీజేపీకి అత్యంత విశ్వసనీయ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం మొదలు భావసారుప్యత ఉన్న శివసేన, అకాలీదళ్ సహా అనేక పార్టీలు మిత్ర బంధాన్ని తెంచుకుని బయటకు వెళ్లిపోయాయి. అయితే చాలా వరకు మోడీ, అమిత్ షా జోడీ ఆయా పార్టీలను సాగనంపారనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
ఒకప్పటి బిజెపి తమకు పట్టు ఉన్నచోట్ల బలపడుతూ బలహీనంగా ఉన్నచోట్ల ఇతర పార్టీలకు చేయందించి పట్టు సాధిస్తూ మూడున్నర దశాబ్దాల ప్రస్థానంలో జాతీయ పక్షంగా స్థిరపడింది. దీనికి ప్రధాన కారణం ఒక నమ్మకం. పెద్ద పార్టీ అయినప్పటికీ తమ మనుగడను దెబ్బతీయదని చిన్నపార్టీల విశ్వాసం. తమ ఉనికికి భంగం వాటిల్లకుండా తమ మాటను గౌరవిస్తుందనే భావన బీజేపీ పట్ల మిత్రపక్షాల్లో నిన్నామొన్నటి వరకూ నెలకొని ఉండేది. అయితే, ఇప్పుడు మిత్రపక్షాలు, ఇతర పక్షాల్లో ఉన్న నమ్మకం, విశ్వాసం సడలిపోతూ వస్తోంది. ప్రత్యేకించి మోడీ, అమిత్ షా ద్వయం పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత అపరిమితమైన అధికారాలు వారిద్దరి వద్దే కేంద్రీకృతమై పోయాయి. దీంతో మిత్రపక్షాలూ కుచించుకుపోయాయి. ఇక్కడ మిత్రులు, శత్రువులు వంటి భేదభావం, సంకీర్ణధర్మం అన్న రాజనీతికి నూకలు చెల్లిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక 2019 ఎన్నికల్లో, బీజేపీ సొంత బలం మరింతగా పెరిగి 303 కు చేరిన నేపధ్యంలో, మోడీ షా జోడీ మిత్ర పక్షాలను మెల్ల మెల్లగ సాగనంపే వ్యూహానికి మరింతగా పదును పెట్టారు. 2019 ఎన్నికల్లో, శివసేన, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జన శక్తి, అకాలీ దళ్, అన్నా డీఎంకే, జేడీ(యు)తో పాటుగా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి చిన్నాచితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఎన్నికలో పోటీచేసి, గెలిచాయి. అయితే ఆ తర్వాత రెండు సంవత్సరాలకే శివసేన, అకాలీ దళ్, ఎల్జీపీ ఇలా ఒకొక్క పార్టీ బయటకు వెళ్లిపోయిన పరిస్థితి. బీజేపీ ప్లాన్ సంపూర్ణం అయితే, శివసేన సైతం త్వరలోనే చరిత్రగా మిగిలిపోతుంది.
అలాగే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ ను సొంత పార్టీలోనే వంత్రిని చేయడంలో బీజేపీ చాలా వరకు సక్సెస్ అయిందనే అంటున్నారు. పార్టీ సీనియర్ నాయకులను బీజేపీ తమ వైపు తిప్పుకుని, నితీష్ కుమార్’ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న జేడీయూ ఆర్సీపీ సింగ్ ను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్దమైన నేపధ్యంలో, నితీష్ కుమార్, ఆయనకు రెండవసారి రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నితీష్, సింగ్ మధ్య దూరం మరింత పెరిగింది. త్వరలో సింగ్.. బీహార్ షిండే కాబోతున్నారనే వాదనలు వినపడుతున్నాయి.
ఇప్పడు తెలంగాణలో కలకలం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎదుర్కొనేందుకు మిత్ర పక్షాల వేటకు బిజెపి సిద్ధమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి, దేశంలో దిగ్విజయ ప్రస్థానం సాగిస్తున్న మోడీ, అమిత్ షా ధ్వయాన్ని కేసీఆర్ తట్టుకోగలరా? కమల దళం సర్పయాగాన్ని అపగలరా? అంటే, అది ఇప్పుడే చెప్పలేమని, పరిశీలకులు అంటున్నారు. రానున్న రోజుల్లో రాజకీయాలు ఎలా మారుతాయో చూడాలి మరి.