చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మూడోసారి తమ దేశాధ్యక్షుడవుతారా ? మళ్ళీ మూడో సారి ఆయనకు పదవీ యోగం ఉందా ? పలువురు నిపుణులు ఇవే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తైవాన్, హాంకాంగ్ ల పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరి, ఇండియాతో గాల్వన్ ఉదంతంతో తెచ్చుకున్న తలనొప్పి.. ఇలా అనేక సమస్యలు ఆయనకు ముచ్చటగా మూడోసారి పదవీ యోగానికి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అందులోనూ 2018 నుంచి చైనా ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా కరోనా వైరస్ తరుణంలో జిన్ పింగ్ ప్రభుత్వం తగిన సమాచారాన్ని ఇతర దేశాలతో షేర్ చేసుకోకుండా మొండి కేసింది. ఇది కూడా ఆయన స్వయంకృతాపరాధమే.. చైనాలో పత్రికా స్వేఛ్చ తప్పుడు పంథాలో పయనిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. గూగుల్, ఫేస్ బుక్ అంటే పింగ్ భయపడే పరిస్థితి నెలకొంది. ఈ కోవిడ్ సమయంలో చైనా ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవకుండా ఒంటెద్దు పోకడలకు పోతోంది. ఇందుకు ఆ దేశంలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ పుట్టిందన్న ఆరోపణలను మొండిగా తిరస్కరించడమే. అయితే జిన్ పింగ్ కి మళ్ళీ పదవీ యోగం లేదనే సందేహాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.
కాగా ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ జానాభా ఉన్న దేశం చైనా. 2013 నుంచి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ కొనసాగుతున్నారు. చైనా అధ్యక్షుడిగా, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా అవతరించారు జిన్‌పింగ్. అయితే 2022 అక్టోబర్ 16న జరగనున్న 20వ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశంలో మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశముందా? అంటే సందేహాలే తలెత్తుతున్నాయి. మావో తర్వాత జి జిన్‌పింగ్ అత్యంత శక్తివంతమైన, సమర్థవంతమైన నాయకుడిగా చైనాలో కనిపిస్తున్నారని రాజకీయ పండితులు చెబుతుంటారు. 8వ కాంగ్రెస్ లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జిన్ పింగ్ కాలక్రమేణా పార్టీపై పట్టు బిగించారు. కొన్నిసార్లు నిస్సందేహంగా, కొన్నిసార్లు సంయమనంతో, రాజకీయ వ్యూహాల ద్వారా తన ఫ్లాన్ ను చాపకింద నీరులా అమలు చేసుకుంటూ వెళ్లాడు జిన్ పింగ్.
అంతకు ముందు పాలకులు పరిమితంగా చేసిన చట్టబద్ధ పాలనలో సంస్కరణలు, సమాలోచనల పక్రియను జిన్‌పింగ్ పూర్తిగా కుదించాడు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఫ్రీడమ్ హౌస్ ప్రతి ఏడాది రూపొందించే `ప్రపంచ స్వతంత్రం’ సూచికలో చైనా స్థానం గతం దశాబ్దకాలంగా 17 నుండి 9కి పడిపోయింది. ఇటీవలనే, జిన్‌పింగ్ ఆధ్వర్యంలోని సీసీపీ హాంకాంగ్‌లో రాజకీయ స్వయం ప్రతిపత్తి, మానవ హక్కులను కూల్చివేసింది. జిన్‌జియాంగ్‌లో మిలియన్ల మంది ముస్లింలపై దారుణమైన నేరాలకు పాల్పడ్డారు. ఒక వంక చైనా జనాభా క్షీణతను తిప్పికొట్టాలని మహిళలను కోరుతూ, మరో వంక వారి హక్కులను అణచివేస్తున్నారు. ఆర్థిక పరంగా, జిన్‌పింగ్ ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి కఠినమైన, రాజకీయ ప్రేరేపిత నిబంధనలను విధిస్తున్నది.
2013లో చైనా అధ్యక్ష బాధ్యతలు తర్వాత జిన్‌పింగ్… ద్రోహులుగా, అవినీతిపరులుగా లేదా అసమర్థంగా భావించే అధికారులను తొలగించడానికి పెద్ద క్యాంపెయిన్ ప్రారంభించారు. ఆ ఖాళీ స్థానాలను తన మిత్రపక్షాలతో భర్తీ చేయడం ద్వారా జిన్‌పింగ్ తన అధికారాన్ని నిర్మించుకున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, జిన్‌పింగ్ పదవీకాలంలో ఇప్పటివరకూ 47 లక్షలకు పైగా అధికారులను విచారించారు. అతని మొదటి సంస్థ విభాగాధిపతి జావో లీజీ. అతని తండ్రి జిన్ పింగ్ తండ్రితో కలిసి పనిచేశారు. 2013లో చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ.. జి జిన్‌పింగ్ 2015 తర్వాత మాత్రమే చైనా ఆర్మీపై తన పట్టును బలోపేతం చేయడానికి కృషి చేశారు. జిన్‌పింగ్.. తాను చనిపోయేవరకు చైనాకు అధ్యక్షుడుగా ఉండాలని కలలు కంటున్నారు.
2015 నుండి జిన్‌పింగ్… తన వార్షిక పని నివేదిక గురించి సమాచారాన్ని అందించాలని పార్లమెంటు, మంత్రివర్గం, సుప్రీంకోర్టుతో సహా ఇతర సంస్థలను ఆదేశించాడు. ఇక మీడియాను తన చెప్పుచేతుల్లో ఉంచుకోవటానికి, తను చెప్పిందే మీడియాలో వేదం అని చెప్పేలా చేయడానికి.. ప్రభుత్వ మీడియాని తన ఆధీనంలోకి తీసుకునేందుకు జిన్‌పింగ్ చాలా మార్పులే చేశారు. 2016లో దేశ మీడియాకు ఇచ్చిన ఉత్తర్వులో.. “పార్టీ హాయ్ ఇంటిపేరు హై’ అనే సందేశాన్ని ఇచ్చిన పార్టీ లైన్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. జిన్ పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ మీడియా స్వతంత్రత క్రమంగా క్షీణించింది. జిన్ పింగ్ కు వ్యతిరేకమైన ప్రచారం క్రమ క్రమంగా పెరిగింది.
దేశంలోనే అత్యున్నత వ్యక్తి అని 2017 సంవత్సరంలో వచ్చిన ప్రకటనలో జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఒక సంవత్సరం తరువాత, జీవితకాలం పాలించే అడ్డంకిని తొలగించారు. అధ్యక్ష పదవికి పదవీ పరిమితిని ముగించారు. దేశ చరిత్రలో పెద్ద పెద్ద నాయకులు చేయలేని పనిని జిన్‌పింగ్ తన వ్యక్తులను ముఖ్యమైన స్థానాల్లో నియమించి సాధించారు. 2021లో అన్ని రకాల మార్పులు చేసిన తర్వాత కూడా జిన్‌పింగ్ చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించారు. 2021లో ఆమోదించిన తీర్మానంలో, పార్టీ రెండు స్థాపనలను నిలుపుకోవాలని ప్రతిజ్ఞ చేసింది. జిన్‌పింగ్‌కు విధేయత గురించి కూడా చర్చించబడింది. అణచివేతను తీవ్రతరం చేస్తున్నప్పటికీ, దేశీయ అసంతృప్తి సంకేతాలు కూడా గణనీయంగా వెలుగులోకి వస్తున్నాయి.
జూన్ నుండి సెప్టెంబరు 2022 మధ్య కాలంలో చైనా పౌరులు దాదాపు 600 నిరసనలు, అసమ్మతి బహిరంగంగా వ్యక్తం చేసిన సందర్భాలను ఒక నివేదిక నమోదు చేసింది. దేశవ్యాప్తంగా విఫలమైన,ఆలస్యమైన గృహనిర్మాణ ప్రాజెక్టులతో మూడవ వంతు నిరసనలు ముడిపడి ఉండటం గమనార్హం. చైనా నేడు ప్రపంచంలో అత్యంత బలంగా ఉంది. రాబోయే దశాబ్దాలలో మరింత శక్తివంతంగా మారనుంది. అయితే జిన్ పింగ్ లెక్కల ప్రకారం 2035 నాటి చైనా పూర్తిగా ఆధునిక సోషలిస్ట్ సమాజంగా ఉండాలి. అలాగే 2050 సంవత్సరం నాటికి చైనా ప్రపంచ వ్యాప్తంగా సంపన్న, శక్తి వంతమైన దేశంగా ఉండాలని ఆయన చెబుతున్నారు. అయితే మరి ఇది ఎంతవరకూ ఉంటుంటో భవిష్యత్తులో చూడాలి. ఆ సంగతి పక్కన ఉంచితే ప్రస్తుతం శనివారం జిన్ పింగ్ మళ్లీ మూడో సారి చైనా అధ్యక్షుడిగా ఉంటారా? లేదా? అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.