– ఎమ్మెల్యే షకీల్ అరాచకం!
– కారు ప్రమాదంలో బయటకొస్తున్న నిజాలు
– చావుబతుకుల మధ్య బాధితురాలు కాజల్
– మహారాష్ట్ర తరలించడం వెనుక పెద్ద కుట్ర
– ఇంతకీ.. షకీల్ కుమారుడు ఎక్కడ..?
జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఉన్నాడని పోలీసులే ప్రకటించారు. కానీ.. అంతకుముందే షకీల్ విడుదల చేసిన వీడియోలో ఆ కారు వేరే వాళ్లదని.. తాను కూడా వాడుతుంటామని చెప్పారు. తన కుమారుడి గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకురాలేదు. అంటే.. అతడ్ని తప్పించాలనే క్రమంలోనే షకీల్ ప్రయత్నాలు చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. అయితే.. ఇప్పుడు సమస్య ఏంటంటే.. కొడుకును తప్పించే క్రమంలో చేసిన తప్పిదాలతో మరో ప్రాణం చావుబతుకుల దగ్గర కొట్టుమిట్టాడుతోంది.
ఆరోజు ప్రమాదంలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వారిలో కాజల్ ఒకరు. ఆమె రెండు నెలల క్రితమే సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ప్రమాదంలో చనిపోయింది కూడా ఆ బిడ్డే. అయితే.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కాజల్ కు కుట్లు వేసిన దగ్గర గాయాలయ్యాయి. ఆమెను నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. ఒక తప్పును కప్పి పుచ్చేందుకు తప్పు మీద తప్పు జరుగుతూ వెళ్లింది. నిమ్స్ లో చికిత్స పొందుతున్న కాజల్ ను బలవంతంగా మహారాష్ట్రకు తరలించారు షకీల్ అనుచరులు.
విచిత్రం ఏంటంటే.. నిమ్స్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఇదంతా జరిగింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న కాజల్ ను వేరేచోటకు తరలించారు. అర్ధాంతరంగా చికిత్స నిలిచిపోవడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్లడం వల్లే బాధితురాలు బలిపశువుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. యజమాని అనుమతి లేకుండా ఏ ఉద్యోగి పని చేయడు. అలాగే షకీల్ పాత్ర లేకుండానే ఆయన అనుచరులు బాధితురాలిని మహారాష్ట్రకు షిఫ్ట్ చేయడం కుదరని పని.
ప్రమాదం తర్వాత బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన కుటుంబసభ్యులతో బేరసారాలు జరిపారు. రూ.2 లక్షలు ఇస్తామని షకీల్ అనుచరులు మాయ మాటలు చెప్పి కాజల్ ను అక్కడి నుంచి తరలించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. దీనిపై ఇంత వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు. హాస్పిటల్ నుంచి ఫిర్యాదు వెళ్లినా.. అలాంటిదేం రాలేదనే సమాధానం వస్తోంది. తెలంగాణలో బడాబాబులకు ఓ న్యాయం.. పేదవారికి ఒక న్యాయం అని ఈ ఘటనతో తేలిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. కుమారుడ్ని తప్పించేందుకు షకీల్ చాలా ప్రయత్నాలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పలువురు. పైగా ఇప్పటివరకు అతని కుమారుడు దొరకకపోవడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.