– 28న కిడ్నాప్ జరిగితే..
– ఇంతవరకు నో అప్ డేట్
– కుటుంబసభ్యులకు లేని సమాచారం
– తొలివెలుగుకు కీలక విషయాలు చెప్పిన రవి ఫ్యామిలీ
– మంత్రి శ్రీనివాస్ గౌడ్ పనేనా..?
– అనుమానిస్తున్నరవి సన్నిహితులు
– జరిగిందంతా వివరించిన జితేందర్ రెడ్డి
– కన్నబిడ్డ కోసం ఎదురుచూస్తున్న తల్లి
స్వరాష్ట్ర సాధన కోసం కష్టపడ్డాడు. జైలు జీవితాన్ని గడిపాడు. పదుల సంఖ్యలో కేసులను ఎదుర్కొన్నాడు. తెలంగాణ కోసం పోరాటం సాగించాడు. కానీ.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా కేసులు మాఫీ కాలేదు. ఉద్యమ కేసులన్నీ ఎత్తేస్తామని పాలకులు ప్రకటించినా కూడా అతనిపై మాత్రం పాత కేసులను తిరగదోడారు. ఇప్పుడు ఏకంగా కిడ్నాప్ నకు గురయ్యాడు. అతనే మున్నూరు రవి.
ఎవరు తీసుకెళ్లారో.. ఎక్కడికి పట్టుకెళ్లారో అంతా సస్పెన్స్ గా మారింది. ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి కేటాయించిన ఇంటి దగ్గర కిడ్నాప్ నకు గురయ్యాడు రవి. అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతోంది. అయితే.. కుటుంబసభ్యులు తెగ ఆందోళన చెందుతున్నారు. రవి క్షేమంగా ఉన్నాడా? లేదా? అని కలత చెందుతున్నారు.
మున్నూరు రవి మాతృమూర్తి ఆవేదన
రవి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కలవరపడుతోంది అతని మాతృమూర్తి. ఆమెను తొలివెలుగు సంప్రదించి ధైర్యం చెప్పింది. ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలను తెలిపింది. మూడు రోజుల క్రితం కొందరు పోలీసులు తమ ఇంటికి వచ్చారని.. రవి ఎక్కడున్నాడని వివరాలు అడిగారని చెప్పింది. హైదరాబాద్ వెళ్లాడని చెప్పినట్లు తొలివెలుగుకు వివరించింది. నెంబర్ అడిగితే ఇచ్చానని.. రవి రాగానే కాల్ చేయమని చెప్పారని తెలిపింది. ఉద్యమ కేసులు కొట్టేశారని కేసీఆర్ చెప్పారు.. కానీ.. పాత కేసులో గతంలో రవిని అరెస్ట్ చేశారని వాపోయింది ఆ తల్లి. ఇప్పుడు ఎవరు ఎత్తుకెళ్లారో తెలియడం లేదని.. తమకు ఎవరూ మద్దతుగా లేరని కన్నీళ్లు పెట్టుకుంది ఆ తెలంగాణ ఉద్యమకారుడి కన్నతల్లి. తన కుమారుడు కావాలని.. తొలివెలుగుతో తన బాధను పంచుకుంది.
తెరపైకి కిడ్నాప్ శాఖ
పాలమూరుకు చెందిన కొందరు వ్యక్తులు కొన్నాళ్లుగా కిడ్నాప్ నకు గురవుతున్నారు. ఇప్పటిదాకా 9 మంది వరకు మిస్ అవ్వగా.. వారిలో ముగ్గుర్ని పోలీసులు రిమాండ్ కు తరలించారు. వారిపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. మిగిలినవారు ఎక్కడున్నారో కనీసం కుటుంబసభ్యులకు సమాచారం లేదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ కు సంబంధించే ఈ కిడ్నాప్ ల పరంపరం కొనసాగుతోందని బాధితుల కుటుంసభ్యులు అంటున్నారు. అందుకే కేసీఆర్ కిడ్నాప్ శాఖను ఏర్పాటు చేసి శ్రీనివాస్ గౌడ్ కు అప్పగిస్తే బాగా పని చేస్తారని చెబుతున్నారు.
జితేందర్ రెడ్డి ఏం చెబుతున్నారు?
మున్నూరు రవి ఉద్యమకారుడు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి. ఆనాడు పోలీసులతో దెబ్బలు తిన్నాడు.. అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికీ టీఆర్‌ఎస్ లోనే ఉన్నాడు. ఢిల్లీలోని తన ఇంటికి రవి వచ్చాడని పీఏ ఫోన్ చేస్తే.. గెస్ట్ రూమ్ లో ఉండమని చెప్పాను. ఏదో పర్సనల్ పని మీద వచ్చానని చెప్పాడు. ఆయనతోపాటు మరో ఇద్దరు ఉన్నారని తర్వాత తెలిసింది. 28న రాత్రి 12 గంటలకు డ్రైవర్ భార్య ఫోన్ చేసింది. తన భర్త కనిపించడం లేదని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పాను. తర్వాత హర్యానా వెళ్తున్నా కంగారు పడకు అని అతను భార్యకు ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె చెప్పింది. తర్వాతి రోజు పీఏ ఆమెను అడగ్గా ఇంకా రాలేదని వాపోయింది. పోలీసులను సంప్రదించగా.. నా ఇంటికి ఉన్న సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో పక్కనే ఉన్న ఇంటి కెమెరాలను పరిశీలించారు. 28న రాత్రి 8.29 గంటలకు రెండు కార్లు వచ్చాయి. డ్రైవర్ రూమ్ దగ్గరకు వెళ్లి.. ఇక్కడ గెస్టులు ఉన్నారంట ఎక్కడ అని అడిగితే అతను ఉన్నారని చెప్పాడు. డ్రైవర్ తో సహా లోపలికి వెళ్లి.. తర్వాత అందర్నీ తీసుకొని వెళ్లిపోయారు. నా పీఏ ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాడు. పోలీసులతో మాట్లాడాం.. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని వదలరని అనుకుంటున్నాం. అది వీఐపీలు ఉండే ఏరియా.. అలాంటి ప్రాంతంలో కిడ్నాప్ జరగడంపై సీరియస్ గా ఉన్నారు ఢిల్లీ పోలీసులు. వచ్చిన వారు పోలీసులు అయితే.. ముందస్తు సమాచారం ఇవ్వాలి. రాజకీయ నాయకుడి ఇంటికి వచ్చి అలా తీసుకెళ్లడానికి లేదు.
న్యాయవాదులు ఏమంటున్నారు?
మున్నూరు రవి కిడ్నాప్ పై హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ తొలివెలుగుతో మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఇలాంటివి కామన్ అయిపోయానని అన్నారు. దాడులు పెరిగిపోయాయని.. ఇద్దరు లాయర్లను నడిరోడ్డుపై చంపేశారని వామనరావు ఘటనను గుర్తు చేశారు. ఈమధ్యే ఓ లాయర్ ను కొట్టారని చెప్పారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. కొందరు పోలీసులు బాధ్యత మరిచిపోయి.. రూలింగ్ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ఆరోపించారు. ఎవరినైనా అరెస్ట్ చేస్తే పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాలని… 24 గంటల్లోగా కోర్టులో హాజరు పరచాలని వివరించారు. కానీ.. చాలా కేసుల్లో అది జరగడం లేదన్నారు. తెలంగాణలో చట్టం లేదు.. న్యాయం లేదు.. రూలింగ్ పార్టీ వాళ్లకే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని చెప్పారు. మెదక్ జిల్లాలో ఓ కేసు విషయమై బాధితుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని వెళ్తే.. ఎస్సై 5 లక్షలు అడిగాడని తనకు ఎదురైన ఘటనను గుర్తు చేశారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అరాచక పాలన సాగిస్తున్నారని.. వెంటనే మున్నూరు రవి కుటుంబసభ్యులు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం ఇవ్వాలని సూచించారు.