వన్యప్రాణులకు రక్షణ కరువైంది. దట్టమైన అడవుల్లో ఉండే వన్యప్రాణులు అడవులను నరికి వేయడం వల్ల సమీపంలో ఉండే గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. దీని వల్ల కొన్ని చోట్ల వేటగాళ్లు, మరికొన్ని చోట్ల రోడ్డు ప్రమాదాల్లో జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఇదిలా ఉంటే అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు ఏర్పాటు చేసే వురులు, విద్యుత్ షాక్ కు గురై మరికొన్ని వన్య ప్రాణులు చనిపోతున్నాయి.
తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గుంతపల్లి సమీపంలో పంట పొలాల్లో ఓ జింక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీని గురించి గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. కానీ విషయం తెలిసినప్పటికీ అటవీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒక ఉన్నతాధికారి సంఘటనాస్థలికి వెళ్లి జింక మృతికి గల కారణాలను కనుగొనాలి.
కానీ కింది స్థాయి ఉద్యోగి జింక చనిపోయిన ప్రదేశానికి వెళ్లి దాన్ని స్వాధీనం చేసుకుని, తుర్కయంజాల్ పరిధిలోని ఒక నర్సరీలో ఖననం చేశారు. కానీ చనిపోయిన జింకను పోస్ట్‌మార్టం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అవేమీ చేయకుండానే దానిని కాల్చివేశారు. అనుమానాస్పదంగా మృతి చెందుతున్న వన్యప్రాణుల విషయంలో అటవీశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
వన్యప్రాణుల వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.ఎక్కోడో చనిపోయిన జింకను నర్సరీలో కాల్చివేయం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వన్యప్రాణుల రక్షణకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.