నాయకత్వలేమితో ఛిన్నాభిన్నమైన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలో పెట్టే క్రమంలో సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పైనే గంపెడాశలు పెట్టుకుంది అధిష్టానం. దేశంలో 5 నెలల పాటు కొనసాగిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ 3,570 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జమ్మూకాశ్మీర్ చేరుకున్నారు. దీంతో ఈ యాత్ర ముగింపు సభ జమ్ముకాశ్మీర్ లోని షేర్ ఎ కశ్మీర్ స్టేడియంలో జరగనుంది. దీనికి కాంగ్రెస్ భారీ జనసందోహాన్ని అంచనా వేస్తోంది. దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానాలు కూడా పంపారు.
మరి ఇప్పుడైనా ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తాయా అన్నది దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ భావసారూప్యత కలిగిన 23 పార్టీలకు ఆహ్వానం పంపింది. ఈ పార్టీల తీరును బట్టి చూస్తే ప్రతిపక్షాలను ఏకతాటి పైకి తేవాలన్న కాంగ్రెస్ ప్రయత్నం ప్రస్తుతానికి అసంపూర్తిగా మిగిలిపోనుందని తెలుస్తోంది. భారత్ జోడో యాత్ర ముగింపులో ఉదయం 9.30 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు. 10 గంటలకు భారత్ జోడో మెమోరియల్ ను ప్రారంభించారు. తరువాత 11 గంటలకు ర్యాలీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.
అయితే భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ర్యాలీలో బీజేపీయేతర పార్టీల సీనియర్ నేతలు గైర్హాజరవడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రతిపక్షాల మధ్య భేదాభిప్రాయాలున్నాయని చెప్పడం సరికాదన్నారు. బిజేపీ ఆర్ ఎస్ ఎస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యంగా ఉన్నాయని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఆప్, వైఎసీపీ,బీజేడీ, బీఆర్ఎస్,ఏఐయూడీఎఫ్ మినహా 23 ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ర్యాలీకి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించబడ్డాయి.
అయితే తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ,జేడియూ సహా దాదాపు సగం మంది పెద్ద నేతలను ర్యాలీకి పంపడం లేదు. కాగా కొన్ని పార్టీలు తమ రెండో లేదా థర్డ్ గ్రేడ్ నేతలను కాంగ్రెస్ ర్యాలీకి హాజరయ్యేందుకు పంపాయి. ఈ యాత్రకు సంబంధించి దేశంలోని ప్రతి మూలన చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు. అయితే మోడీ వ్యతిరేకంగా ఉన్న వారందర్ని సమీకరించాలన్న కాంగ్రెస్ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.