‘‘మా ఎమ్మెల్యే సూపర్ తెలుసా. ఏ పని అడిగినా చేసి పెడతాడు. ఆయన రౌడీ అని.. భూములు కబ్జా చేస్తాడని అంటారు గాని.. అవన్నీ మనకు తెలియదు.. ఆయన మంచోడే’’. ‘‘మా ఎమ్మెల్యే మంత్రి కూడా అయ్యాడు. మా ఊళ్లో ఏ ఆటో మీద చూసినా, ఏ లారీ మీద చూసిన ఆయన బొమ్మే. అందరికీ ఆయనంటే అంత అభిమానం. బాగా సాయం చేస్తాడు. రౌడీ అంటారు గాని.. మనకు మంచోడే’’
ఇది ఇద్దరు నాయకుల గురించి వారి అభిమానులు చెప్పుకునే మాటలు. దావూద్ ఇబ్రహీంను కూడా ఆయన అభిమానులు విపరీతంగా ప్రేమిస్తారు. ఆయన కూడా ఆయన అభిమానులకు చాలా సాయం చేస్తాడు.. అలాగని దావూద్ మంచోడే అనగలమా? ప్రతి రౌడీ, ప్రతి గ్యాంగ్ లీడర్.. తనను నమ్ముకున్నవాళ్లకు సాయం చేస్తారు. వాళ్ల మీద అనుమానం వస్తే ప్రాణం కూడా తీస్తారు. అయినా బతికున్నంతవరకు వీళ్లను పూజిస్తారు.
రౌడీయిజం ఒకప్పుడు రాజకీయానికి సాయం చేసేది. తర్వాత అదే ఏకంగా రాజకీయం పాత్రలోకి వచ్చేసింది. కెమెరా ముందు మర్యాదగా.. కెమెరా వెనకాల మొరటుగా వ్యవహరించడం పరిపాటే. కాని ఇప్పుడు ఆ ట్రెండ్ ను కూడా బ్రేక్ చేశారు.. మన యువ నాయకులు. కెమెరా ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి.. ఎవడు వింటే ఏంటి.. వినకపోతే ఏంటి.. నేననుకున్నది మాట్లాడతా.. అన్నట్లు తయారయ్యారు.
ఒకరు చెత్త నా… అంటే.. మరొకరు నీయమ్మ మొగుడు అంటాడు. ఒకరు ఎమ్మెల్యే అయితే.. మరొకరు ఏకంగా మంత్రి. మీడియా ముందు ఉన్నామన్న ఇంగితం కూడా లేకుండా.. తమ ఒరిజినల్ కేరెక్టర్లను బయటపెట్టేశారు. వారేంటి.. వారి యాటిట్యూడ్ ఏంటనేది.. అందరికీ అర్ధమయ్యేలా చూపించారు.
వల్లభనేని వంశీ. ఈ పేరు కృష్ణాజిల్లానే కాదు.. చాలామందికి తెలుసు. సారు సినిమాలు కూడా తీస్తారు. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ తో .. అందుకే ఫేమస్. ఒకప్పుడు పరిటాల రవి గ్రూపులో ఉండేవారు. ఆయన చనిపోయాక.. సొంతంగా వ్యవహారాలు చేసుకుంటున్నారు. ఈయనను రాజకీయంగా పెద్దమనిషి చేసింది టీడీపీనే. ఏ మాటకా మాట.. ఆయన అభిమానులు చెప్పినట్లు.. తన నియోజకవర్గంపై పట్టు సంపాదించారు. మట్టి ఎత్తుకుపోయారు.. భూములు లాగేసుకున్నారు.. చెప్పిన మాట విననివారిని ముక్కలుగా నరుకుతారు లాంటి ఆరోపణలు చాలానే ఉన్నాయి. అయినా వైసీపీ వేవ్ లో సైతం.. టీడీపీ తరపున గెలవగలిగారు. ఇందుకు సొంత ఇమేజ్ కూడా ఒక కారణమే అనుకోవచ్చు. అలాంటి వంశీ ఇప్పుడు నేచురల్ గానే అధికార పార్టీ వైపు తిరిగిపోయారు. టీడీపీకి భవిష్యత్ లేదని ఫీలయిపోయి.. రాజీనామా చేసేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ప్రెస్ మీట్లు పెట్టి.. చంద్రబాబును, లోకేష్ ను ఒక రేంజ్ లో వేసుకున్నాడు. ఒకప్పుడు ఆ ఫైలు చేయాలి.. ఇది ఓకె చేయాలి అంటూ వినయంగా వారి చుట్టుతిరిగినవాడు.. సెటైర్లు వేసే స్టేజికి వెళ్లిపోయాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. లైవ్ నడుస్తుండగా కొలీగ్ (ఇప్పుడు కాదు) రాజేంద్రప్రసాద్ పై విరుచుకుపడుతూ వాడిన భాష నిజంగా జనానికి షాకిచ్చింది.
ఇక కొడాలి నాని గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈయన కూడా జూనియర్ ఎన్టీఆర్ కు క్లోజ్. పైగా ఆయనతో సినిమాలు చేశాడు. గుడివాడ రౌడీ అని ఆయనను ముద్దుగా అభిమానులు పిలుచుకుంటారు. ఈయనను కూడా తెలుగుదేశమే రాజకీయంగా లీడర్ ను చేసింది. ఆ తర్వాత ఆయన లోకల్ కారణాలతో పాటు, జూనియర్ ఎన్టీఆర్ ను, హరికృష్ణను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారనో కోపంతో.. వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మంత్రి అయ్యారు. ఈయన జనరల్ గా ఎక్కువగా మాట్లాడరు. మాట్లాడితే మాత్రం మనం వినలేం.. ఇదైతే వాస్తవమే. గతంలో అసెంబ్లీలోనూ అదే రకంగా ప్రవర్తించారు. ఇప్పుడు మంత్రిగా కూడా అదే రేంజ్ లో విరుచుకుపడ్డారు. తిరుమల వెంకన్న స్వామి గుడి గురించి.. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావుల గురించి.. రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు ఇలాంటివారిని నాయకులు చేసిన టీడీపీని తిట్టాలో.. పెంచి పోషిస్తున్న వైసీపీని అనాలో జనానికి అర్ధం కావడం లేదు. వారి యాటిట్యూడ్ చూసి, వారి అభిమానులు హీరోయిజం అనుకుంటుంటే.. ఇతరులు మాత్రం రౌడీయిజం రాజకీయంపైనే రంకెలేస్తోందని ఫీలవుతున్నారు.