అండమాన్, నికోబార్ లోని 21 దీవులకు పరాక్రమ్ దివస్ సందర్భంగా నిన్న ప్రధాని మోడీ పేర్లు పెట్టారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు. వీరిలో ఒక్కొక్కరు దేశం కోసం ఎలా ప్రాణాలను తృణప్రాయంగా వదిలారో తెలుసుకోవలసిందే.
మేజర్ సోమనాథ్ శర్మ.. పరమవీర్ చక్ర అవార్డు గ్రహీతల్లో ఈయన మొట్టమొదటివారు. 1947 నవంబరు 3 న కశ్మీర్ లోయలోని బడ్గామ్ ఏరోడ్రోమ్ వద్ద జరిగిన శత్రుదాడిలో జరిగిన ఘటనలో ప్రాణాలు వదిలారు. ఆరు గంటలపాటు శత్రువులపై కాల్పులు జరిపి అమరులయ్యారు. నాయక్ జాదూనాథ్ సింగ్.. 1948 ఫిబ్రవరి 6 న జమ్మూ కశ్మీర్ లోని నౌషేరా సెక్టార్ లో జరిగిన శత్రు దాడిలో ఒంటరిగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు.
సెకండ్ లెఫ్టినెంట్ రామ రాఘోబా రాణే.. 1948 ఏప్రిల్ 8 న నౌషేరా-రాజౌరి రోడ్ లో శత్రుదాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ ధైర్యం కోల్పోకుండా యుద్ధ ట్యాంకును ముందుకు దూకించి కొందరు శత్రువులను హతమార్చారు. ఆ ఘటనలో అసువులు బాసారు. కంపెనీ హవల్దార్ మేజర్ పీరూ సింగ్.. 1948 జులై 18 న కశ్మీర్ లో జరిగిన పేలుడులో మరణించారు. శత్రు దాడిలో ముఖమంతా రక్త మోడుతున్నా.. చలించక పోరాడారు. లాన్స్ నాయక్ కరమ్ సింగ్.. 1948 అక్టోబరు 13 న జమ్మూ కశ్మీర్ లోని రిచ్ మర్ గాలి వద్ద కమాండింగ్ సెక్షన్ విధుల్లో ఉంటూనే.. ఈ ప్రాంతం శత్రువుల వశం కాకుండా పోరాడారు.
కెప్టెన్ గురుబచన్ సింగ్ సలేరియా .. 1961 డిసెంబరు 5 న కటంగా వద్ద జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడినప్పటికీ సుమారు 40 మంది శత్రు సైనికులను మట్టుబెట్టారు. మేజర్ ధన్ సింగ్ థాపా .. 1962 అక్టోబరు 20 న ఇండో-చైనా యుద్ధ సమయంలో అసువులు బాసారు. ఇంకా సుబేదార్ జోగీందర్ సింగ్, మేజర్ షైతాన్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపోర్, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, నిర్మల్ జిత్ సింగ్ సేఖాన్, మేజర్ హోషియార్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్ పాల్, నాయబ్ సుబేదార్ బాణాసింగ్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, యోగేందర్ సింగ్ యాదవ్, రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్, కెప్టెన్ విక్రమ్ బాత్రా.వంటివారు ఇండో-చైనా వార్ సమయంలోను, భారత-పాకిస్తాన్ యుద్ధ సమయాల్లోనూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు.