– టీఆర్ఎస్ ధర్నాలు ఎవరికి లాభం?
– రైతులకా? దళారులకా?
– రా రైసే ఇస్తామని సంతకం ఎందుకు చేశారు?
– ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనాలని ఎందుకు అడుగుతున్నారు?
– రైతులను నట్టేట ముంచే కుట్ర జరుగుతోందా?
– దళారులకు లాభం చేకూర్చేలా చూస్తున్నారా?
ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ ది డ్రామానా? రైతులపై కురిపిస్తున్న ప్రేమ అంతా నాటకమా? విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు డైవర్షన్ లో భాగంగానే గులాబీ దండు ధర్నాలు చేస్తోందా? దళారీ మాఫియాతో కుమ్మక్కై కమీషన్ల కోసమే కేంద్రంపై యుద్ధమని చెబుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ పండితుల నుంచి. పైగా పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక.. ఢిల్లీలో ధర్నా చేస్తే ఎవరు పట్టించుకుంటారు.. దీన్నిబట్టే టీఆర్ఎస్ చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతోందని అంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో చెప్పాలంటే.. ఇది అయిపోయిన సినిమాకు టికెట్స్ అమ్ముకున్నట్టేనని చెబుతున్నారు.
నిజానికి రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ధర్నా చేస్తే మిగిలిన పార్టీలు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొనే అవకాశం ఉండేది. ఇప్పుడు సమావేశాలు ముగిశాయి. ఎంపీలు ఎవరి స్టేట్ కు వాళ్లు వెళ్లిపోయారు. ఎవరి గోలలో వారు ఉంటారు. ఇలాంటి సమయంలో ధర్నా అంటే ఉపయోగం ఉండదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీన్నిబట్టే ఇది డ్రామా అనేది స్పష్టంగా అర్థం అవుతోందని అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో వరి వేశారు. 80 లక్షల క్వింటాళ్ల పంట పండితే.. 30 లక్షల క్వింటాళ్లు స్థానికంగా అవసరం ఉంటుంది. మిగిలిన 50 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతాయి. రైతుల నుంచి సేకరించి ధాన్యాన్ని ఎఫ్సీఐకి తిరిగి ఇవ్వటం ద్వారా రూ.12 వేల కోట్లు వస్తాయి. కానీ.. కేసీఆర్ అది చేయకుండా రైతులను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్నాయి ప్రతిపక్షాలు. అన్నాదాతలపై టీఆర్ఎస్ కు నిజంగా ప్రేమ ఉంటే ధాన్యం కొనుగోళ్లు చేసి కేంద్రానికి పంపేలా చర్యలు తీసుకుంటుందని అంటున్నాయి.
టీఆర్ఎస్ ధర్నాల వెనుక పెద్ద కుట్ర ఉందనేది బీజేపీ, కాంగ్రెస్ వాదన. దళారులతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నాయి. ఏదో రకంగా గొడవ చేసి రైతుల దగ్గర నుంచి మద్దతు ధరకు కాకుండా తక్కువ రేటుగా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చేయాలనే ప్లాన్ లో భాగంగానే ధర్నాల పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడుతున్నాయి. అందుకే యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసివేశారని.. దళారులకు తక్కువ రేటుకే అమ్ముకునేలా రైతులకు అనివార్య పరిస్థితులు సృష్టించి పెద్దఎత్తున లబ్ది పొందాలని కేసీఆర్ పథకం రచించారని విమర్శిస్తున్నాయి.
ధాన్యాన్ని నేరుగా మిల్లింగ్ చేస్తే వచ్చే బియ్యాన్ని రా రైస్ లేదా ముడిబియ్యం అంటారు. ధాన్యం ఉడికించి ఆ తర్వాత మిల్లింగ్ చేస్తే దాన్ని బాయిల్డ్ రైస్ గా పిలుస్తారు. తెలంగాణలో ఖరీఫ్ సీజన్ లో పండే ధాన్యంతో ముడి బియ్యం, యాసంగి(రబీ) ధాన్యంతో బాయిల్డ్ రైస్ ఉత్పత్తి జరుగుతోంది. రబీలో స్థానికంగా ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా బాయిల్డ్ రకం బియ్యం ఉత్పత్తికే పండిన ధాన్యం అనుకూలంగా ఉంటుంది. ముడి బియ్యంగా మారిస్తే నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలిసి కూడా బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేసీఆర్ సంతకం పెడుతూ కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు.
ఒప్పందం ప్రకారం ఎంత రా రైస్ అయినా కొంటామని కేంద్రం చెబుతోంది. చివరి గింజ వరకు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయినా కూడా మెడ మీద కత్తి పెట్టి సంతకం చేయించుకున్నారని కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడుతోంది బీజేపీ. దళారులతో కలిసి పోయి రైతులను నట్టేట ముంచడానికే ఇలా వ్యవహరిస్తోందని బండి సంజయ్ పదే పదే చెబుతూ వస్తున్నారు. కేసీఆర్ కుట్రను ఎండగడుతున్నారు. కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై రైతన్నలు సైతం మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ధర్నాలు అంటూ నాటకాలు ఆడితే ఆ మాత్రం ఆర్థం చేసుకోలేమా? అని చెబుతున్నారు.