ప్రస్తుతం మార్కెట్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు నటించిన పాత సినిమాల్ని అభిమానులు పోటీపడి మరీ రిలీజ్ చేస్తున్నారు. అలా తమ అభిమాన హీరోల పుట్టినరోజులు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఫ్లెక్సీలు, కేక్ కటింగ్స్, రక్తదానాలకే పరిమితమైన సెలబ్రేషన్లు.. ఇప్పుడిలా రీ రిలీజెస్ వరకు వెళ్లాయి. అయితే ఇలా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం?
స్టార్ హీరో పుట్టినరోజున రక్తదానం చేయడం చాలా మంచి పని. అన్నదానంతో పేదల కడుపులు నిండుతాయి. ఫ్లెక్సీలతో అభిమానులు కూడా హ్యాపీ. మరి పాత సినిమాల రీ రిలీజ్ ల వల్ల ఎవరికి ఉపయోగం. కేవలం నిర్మాతకు మాత్రమే. అభిమానులకు థియేటర్లలో హంగామా మాత్రమే మిగులుతుంది. పేదలకు ఒరిగేదేం లేదు.
నిజానికి కొన్ని సినిమాల్ని ఛారిటీ కోసం ప్రదర్శిస్తున్నారు. ఆమధ్య బాలయ్య పాత సినిమాను రీ రిలీజ్ చేశారు. వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని బసవతారకం ఛారిటబుల్ ట్రస్ట్ కు ట్రాన్సఫర్ చేశారు. పవన్, చిరంజీవి సినిమాల వసూళ్లలో కూడా కొంత భాగాన్ని చారిటీ కోసం వాడారు. అయితే, రాబోయే రోజుల్లో ఎంతమంది ఇలా ఉదారంగా వ్యవహరిస్తారనేది ప్రశ్నార్థకం.
కేవలం ఫ్యాన్స్ ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోవడం కోసం కొంతమంది నిర్మాతలు భవిష్యత్తులో ఇలాంటి రీ రిలీజ్ కార్యక్రమాలు పెట్టుకుంటే, మరోసారి అభిమానుల జేబులకు చిల్లులు పడడం తప్ప ఉపయోగం ఉండదు.
ఇప్పటికే హీరోల ఫ్యాన్స్ ఈ విషయంలో పోటీపడడం మొదలైంది. పాత సినిమాల్ని వెలికితీసే కార్యక్రమం షురూ అయింది. కాస్త ఆ ఆత్రాన్ని, ఉత్సాహాన్ని ఆపుకొని.. నలుగురికి ఉపయోగపడే విధంగా కార్యాచరణ చేసి, ఆ తర్వాత రీ రిలీజ్ వ్యవహారం పెట్టుకుంటే అందరికీ మంచిది. లేదంటే, మరోసారి నిర్మాత జేబులు నింపడానికి తప్ప, ఈ రీ రిలీజ్ లు ఎందుకూ పనికిరావు.