పేదల వైద్య సేవల కోసం ప్రభుత్వాలు ఉచిత పథకాలను అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం పేదల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపించిందని స్పష్టం చేసింది. ఈ మహమ్మారి దెబ్బకు సుమారు 50 కోట్ల మంది పేదరికంలోకి కూరుకుపోయారని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది.
కరోనా మహమ్మారికి ముందున్న ఆరోగ్య సేవలు అంత గొప్పగా ఏం లేవని.. ఇప్పటికైనా వైద్యసదుపాయాలను సమకూర్చుకోవాలని తెలిపింది. భవిష్యత్ లో మరిన్ని మహమ్మారులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. ప్రతీ ఇంటికి వైద్యసౌకర్యలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
పేద ప్రజలు సొంతంగా వైద్యం కోసం ఖర్చు చేసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రజారోగ్యంపై నిధులు కేటాయించాలని తెలిపింది. అలాగే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ సూచించారు. కరోనా మహమ్మారి పేదల ఆర్థిక మూలాలను బాగా దెబ్బ తీసిందని తెలిపారు.