విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ప్రభుత్వంపై సరికొత్త ఆరోపణలతో విరుచుకపడ్డారు. అదానీ ఆధ్వర్యంలోని గ్రూప్ కి, ‘ఎలారా’ ఓ విదేశీ సంస్థకు మధ్య సంబంధాలు ఉన్నాయని, ఈ సంస్థకు భారత మిసైల్ రాడార్ అప్ గ్రేడ్ కాంట్రాక్టును ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎలారాను ఎవరు నిర్వహిస్తున్నారు ? దాని వివరాలేమిటి ? కీలకమైన డిఫెన్స్ ఈక్విప్ మెంట్ కాంట్రాక్టును ఓ అజ్ఞాత సంస్థకు ఇవ్వడం ద్వారా ఈ దేశ జాతీయ భద్రతను పణంగా ఎందుకు పెడుతున్నారు అని ఆయన మరిన్ని ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేశారు.
ఎలారా సంస్థకు సంబంధించి వచ్చిన ఓ న్యూస్ రిపోర్టును ఆయన ప్రస్తావించారు. అయితే ఎలారా ఇండియా ఆపర్చ్యునిటీస్ ఫండ్ అన్నది వెంచర్ క్యాపిటల్ ఫండ్ అని.. మారిషస్ లో రిజిస్టరయిన నాలుగు టాప్ ఎంటిటీల్లో ఇది కూడా ఒకటని, దీనికి అదానీ గ్రూప్ కంపెనీల్లో షేర్లు ఉన్నాయని ఈ న్యూస్ రిపోర్టు పేర్కొంది.
గత మూడేళ్ళలో ఈ గ్రూప్ తన షేర్లను తగ్గించుకుంటూ వచ్చిందని, కానీ మూడు అదానీ సంస్థల్లో దీని షేర్లు తొమ్మిది వేల కోట్ల మేరకు ఉన్నాయని తెలుస్తోంది. అదానీ గ్రూప్ తో బాటు ఎలారా బెంగుళూరు లోని అల్ఫా డిజైన్ టెక్నాలజీస్ అనే డిఫెన్స్ కంపెనీకి ప్రమోటర్ ఎంటిటీగా పని చేస్తోందట. 2003 లో ఏర్పాటైన అల్ఫా డిజైన్ సంస్థ ఇస్రోతోను, డీఆర్ డీఓతోను కలిసి పని చేస్తోందని ఈ రిపోర్టు వివరించింది.
కాలం చెల్లిన ‘పెచోరా’ మిసైల్, రాడార్ సిస్టం లను అప్ గ్రేడ్ చేసేందుకు 2020 నుంచి ఈ రక్షణ సంస్థ కృషి చేస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖతో రూ. 590 కోట్ల విలువైన కాంట్రాక్టును ఈ సంస్థ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే అసలే వివిధ ఆరోపణలకు గురైన అదానీ సంస్థలకు ఎలారా లోని కీలక ఇన్వెస్టర్ తో సంబంధాలేమిటని రాహుల్ గాంధీ అంటున్నారు.