–యూపీలో బీజేపీకి చేదు అనుభవమేనా..?
–నల్ల చట్టాల రద్దు చేసినా రైతులు బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారా..?
–బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు ఫలించేనా..?
–బీజేపీ వ్యతిరేక పోరాటంలో ఎస్‌కేఎం కీలక పాత్ర
–యూపీ,పంజాబ్ లో రైతుల మద్దతు ఎటు..?
–యూపీ చుట్టూ తిరుగుతున్న దేశ రాజకీయాలు
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రచారాలు జోరందుకున్నాయి. కానీ.. దేశం రాజకీయం మొత్తం ఉత్తరప్రదేశ్ వైపే చూస్తోందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం దేశ రాజకీయం అంతా ఉత్తరప్రదేశ్ రాజకీయాల చేట్టే తిరుగుతోంది. అయితే.. అక్కడ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది. యూపీతో పాటు.. పంజాబ్ లోనూ వ్యవసాయ చట్టాలపై రైతుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఎవరికి ఓటు వేస్తారనేది ప్రశ్న బీజేపీని తొలిచేస్తోంది. దానికి తోడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ రైతులకు కలిసొచ్చే అంశం కూడా ఏం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతులు కేంద్రం ముందుంచిన డిమాండ్లను నేరవేర్చడంలోనూ మోడీ ప్రభుత్వం విఫలమయిందనే ఆగ్రహంతో రైతులు రగిలిపోతున్నారు. ఇటీవలే విశ్వాస్ ఘాత్ దినాన్ని కూడా నిర్వహించారు.
అయితే.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దుతో రైతులు బీజేపీకి అనుగుణంగా అవుతోందని బావించినప్పటికీ.. అది నెరవేరేలా కనిపించడంలేదని రాజకీయ విశ్లేషకులు చేప్తున్నారు. మరోవైపు రైతు చట్టాల రద్దు మోడీ ఘనత ఏం కాదని.. ఏడాదిపాటు తాము చేసిన ఉద్యమ ఫలితమేనని రైతులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీకి తప్ప మరే పార్టీ కైనా ఓటు వేయండని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ప్రచారం చేస్తోంది. అయితే.. కనీసం 23 పంటలకు మద్దతు ధరను కల్పించాలని కొంత కాలంగా ఉద్యమాన్ని చేస్తోంది ఎస్‌కేఎం. కేంద్రం రైతులకు అనుకూలం కాదని అంటోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మళ్లీ వ్యవసాయ చట్టాలను తీసుకొస్తారనే ప్రచారం జోరుగా చేస్తోంది ఎస్‌కేఎం.
వ్యవసాయ చట్టాల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఏడాదిపాటు ఎండా, వాన లకు తెగించి.. గడ్డ కట్టించే చలిని లెక్కచేయకుండా జరిపిన ఉద్యమంలో సుమారు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని.. అయినా కేంద్ర సర్కారు రైతులను ఖలిస్థానీలుగా, ఆందోళన కారులుగానే చూసిందని ఎస్‌కేఎం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లో హిందుత్వ కార్డు ప్రయోగిస్తూ.. బీజేపీ వ్యూహలను రచిస్తోందని మండిపడుతోంది. ఏడేళ్ల క్రితం ముజఫర్ నగర్ లో చోటు చేసుకున్న ఘర్షణల్లో 60 మంది మరణించడానికి అదే కారణం అని ఆరోపిస్తోంది. అయితే.. జనవరి 29న ముజఫర్ నగర్ లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మీరు ఆనాటి హింసాకాండను మరచిపోయారా? అని ఓటర్లను ప్రశ్నించడం అందుకు నిదర్శనమని మండిపడుతోంది ఎస్‌కేఎం. జాట్లు మొదట హిందువులని, తరవాతే రైతులని గ్రహించాలని బీజేపీ సందేశమిస్తోంది. కానీ.. ఏడాదిపాటు ఉద్యమంలో పాల్గొన్న రైతులు తాము మొదట రైతులం, తరవాతే హిందువులమని గుర్తుంచుకోవాలని ఎస్‌కేఎం పిలుపునిచ్చింది.
పశ్చిమ యూపీలో జాట్ల పార్టీగా పేరుపడిన రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌధురి వైఖరి ఇదే. సమాజ్ వాదీ పార్టీతో పెట్టుకున్న పొత్తును తెంచుకుని ఆర్‌ఎల్‌డీ మళ్ళీ సొంతింటికి రావాలని జనవరి 26న బీజే పీ ఎంపీ పర్వేష్ వర్మ పిలుపిచ్చారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆర్‌ఎల్‌డీ.. ఈసారి సమాజ్ వాదీ పార్టీతో చేతులు కలిపింది. వర్మ పిలుపుకు స్పందించిన జయంత్ చౌధురి.. నన్ను మీ ఇంటికి రమ్మని ఆహ్వానించకండి. ఉద్యమంలో ప్రాణాలర్పించిన 700 మంది రైతుల కుటుంబాలను పిలవండి అని ట్వీట్ చేశారు. పశ్చిమ యూపీలో జాట్లు తాము మొదట హిందువులం.. తరవాతే రైతులమని భావించారు కాబట్టి 2014, 2017, 2019 ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారు. కానీ.. 2022 ఎన్నికల్లో మతాన్ని బట్టి కాకుండా ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలనుకుంటున్నామని అంటున్నారు రైతులు. 2013నాటి అల్లర్ల చేదు స్మృతుల ప్రభావం ఉద్యమంపై కనిపించకుండా వ్యవసాయ చట్టాలపై కలిసి ఉద్యమం చేసిన ముస్లిం కర్షకులకు మద్దత ఇస్తాం అంటున్నారు జాట్ రైతులు.