కాపు సామాజికవర్గాన్ని బిజెపి కాపు కాసి మరీ గుప్పిట్లో పెట్టుకోవాలని తెగ తాపత్రయపడుతోంది. సోము వీర్రాజును అధ్యక్షుడు చేయడం.. ఆయన వెంటనే మెగాస్టార్ చిరంజీవిని.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ను కలవడం.. కన్నుకొట్టి మరీ కాపులకు సిగ్నల్ ఇచ్చినట్లయింది. ఇప్పుడు ఏకంగా కాపు సంక్షేమ సేన అంటూ హరిరామజోగయ్యను రంగంలోకి దించింది. పేరు జనసేనను పోలినా.. జనసేన దీని వెనక ఉన్నా కూడా.. జనసేనకు ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చేది కమలమే కదా.. పైగా కాపు సామాజికవర్గాన్ని వారు టార్గెట్ చేశారన్నది అందరికీ తెలిసిందే.
ముద్రగడ పద్మనాభం అలిగినట్లు నటించి.. కాపు రిజర్వేషన్ల అంశాన్ని గాలికొదిలేసి.. జగనన్న ఆదేశాల మేరకు పక్కకు వెళ్లిపోయారు. ఆ తర్వాత దీన్ని జనసేన టేకప్ చేస్తుందనే అంచనాలు వచాయి. దానికి తగ్గట్లుగానే పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు. కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబునాయుడే 2014 ఎన్నికల హామీగా తెరపైకి తెచ్చారు. తర్వాత దానిని అమలు చేయాలంటూ ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగారు. ఆయన వెనక జగన్ ఉన్నారనే సంగతి అందరూ చెప్పుకున్నారు. పైగా ఆ ఉద్యమం ఆరంభంలోనే రైలు దగ్ధం లాంటి హింసాత్మక ఘటన చోటు చేసుకుంది.
ఇక దానిపై కేసులు.. ముద్రగడ హౌస్ అరెస్ట్ వంటివి జరిగాయి. చంద్రబాబు ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేశారనే విమర్శలు వచ్చాయి. అయితే తర్వాత రాజకీయ వ్యూహంతో చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కేంద్రానికి తీర్మానం పంపటం.. ఆ తర్వాత కేంద్రం ఇచ్చిన ఓబీసీలో కాపులకు 5% కేటాయిస్తూ బిల్లు చేయడం జరిగాయి. కాని ఎప్పుడూ కాపులకు రిజర్వేషన్ల పట్ల సుముఖంగా లేని జగన్.. దానిపై ఏనాడు మాట మాత్రమైనా పాజిటివ్ గా మాట్లాడలేదు.. దానికే కట్టుబడి.. అధికారంలోకి వచ్చాక.. ఉన్న బిల్లును కూడా అమలు చేయకుండా.. కేంద్రం పేరు చెప్పి తప్పించుకున్నారు. కాపు నేస్తం పేరుతో నగదు సాయం పథకం మొదలెట్టారు.
అయితే 50 లక్షల మంది ఉంటే కేవలం 2.5 లక్షల మందికే ఆ సాయం అందిందని.. ఇది కేవలం మోసం అంటూ కాపు నేతలే ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్ల బిల్లు ఆల్రెడీ పాస్ అయ్యాక కూడా అమలు చేయకపోవడమేంటని.. కాపు నేతలు పట్టుబట్టడం.. ఇప్పుడు దానికి ఓ సంస్థను స్థాపించడం జరిగాయి. మరి బిజెపి వైసీపీ రహస్య స్నేహంతో.. దానిని ఎలా డీల్ చేస్తారో.. లేక బిజెపి రాజకీయంగానే ప్రవర్తించి.. దీని ద్వారా లబ్ది పొందాలని చూస్తుందా.. మళ్లీ జీవీఎల్ వీర్రాజులు జగన్ కు ఇబ్బంది కలిగితే తట్టుకోలేక వ్యూహం మారేలా ప్లాన్ చేస్తారో చూడాలి మరి.