పంజాబ్ సింగర్ సిద్దు మూసేవాలా హత్యకేసు నిందితుడు.. గ్యాంగ్ స్టర్ దీపక్ టినూ ఇటీవల పోలీసు కస్టడీనుంచి తప్పించుకుని పారిపోయాడు. మాన్సా జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇతడు తప్పించుకోవడానికి ఇతని గర్ల్ ఫ్రెండ్ సహకరించిందని పోలీసులు తెలిపారు. ఆమెను ముంబై విమానాశ్రయంలో అరెస్టు చేసినట్టు వారు వెల్లడించారు. టినూ కోసం అహర్నిశలూ గాలిస్తుండగా ఈమె పట్టుబడిందని డీజీపీ గౌరవ్ యాదవ్ చెప్పారు. అయితే ఆ గ్యాంగ్ స్టర్ ఎక్కడికి పారిపోయాడన్నది మిస్టరీగా ఉంది. , దేశంలోనే ఉన్నాడా లేక దేశం వదిలి పరారయ్యాడా అన్నది తెలియడం లేదని ఆయన అన్నారు.
అతని గర్ల్ ఫ్రెండ్ మాల్దీవులకు వెళ్లబోతుండగా ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. టినూ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుంటున్నప్పుడు ఈమె అతని వెంట ఉందని, కానీ అప్పట్లో ఈమెను అనుమానించలేదని అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ కి టినూ సహచరుడు.
మరో కేసులో ఇతడిని విచారించేందుకు ఈ నెల 1 న పోలీసులు కోర్టుకు తీసుకువెళ్తుండగా వారి కళ్ళు గప్పి పారిపోయాడు. సిద్దు మూసేవాలా మర్దర్ కేసులో 24 మంది నిందితులపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. వారిలో టినూ ఒకడు. ట్రాన్సిట్ రిమాండుపై ఇతడిని ఢిల్లీ లోని తీహార్ జైలు నుంచి జులై 4 న ఇంటరాగేషన్ నిమిత్తం మాన్సా జిల్లాకు తీసుకువచ్చారు.
ఎవరీ గర్ల్ ఫ్రెండ్ ?
గ్యాంగ్ స్టర్ దీపక్ టినూ గర్ల్ ఫ్రెండ్ గా చెబుతున్న యువతి పేరు జితేందర్ కౌర్ అట.. లూధియానాకు చెందిన ఈమె.. దీపక్ ని పోలీసు కస్టడీ నుంచి తప్పించడానికి ముందే ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఈమె కదలికలపై ఇంటలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టడంతో ప్రత్యేక ‘ఆపరేషన్’ నిర్వహించి ముంబై ఎయిర్ పోర్టులో పట్టుకున్నారు.