– టీఆర్ఎస్ కు బూర నర్సయ్య గుడ్ బై
– కేసీఆర్ కో దండం అంటూ రాజీనామా
– బీసీలను అణగదొక్కుతున్నారని ఆగ్రహం
– మరి.. కర్నె ప్రభాకర్ సంగతేంటి?
– ఆయన కూడా బూర దారిలోనేనా?
– ఇంకెంతమంది అసంతృప్తిలో ఉన్నారు?
– బీజేపీకి టచ్ లో ఉన్నదెవరు?
మునుగోడులో సెమీ ఫైనల్ కాదు.. ఫైనల్ అని అంటోంది బీజేపీ. కాంగ్రెస్ సైతం పోటాపోటీగా ప్రచారం సాగిస్తోంది. వామపక్షాలతో మునుగోడులో గట్టెక్కాలని దోస్తీ కట్టింది టీఆర్ఎస్. అయితే.. సొంత పార్టీ నేతల తీరుతో కేసీఆర్ కు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. మునుగోడులో టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మునుగోడు టికెట్ అంశం తనకు సమస్యే కాదని, బీసీలకు టికెట్ పరిశీలించండి అంటూ అడగటమే నేరం అయితే.. పార్టీలో ఉండటమే అనవసరమని భావించానని తెలిపారు. తెలంగాణలో బీసీలు వివక్షకు గురి కావటం బాధాకరమన్నారు. కేసీఆర్ పై అభిమానంతో ఇన్నాళ్లూ పార్టీలో ఉన్నానన్న ఆయన.. అభిమానానికి, బానిసత్వానికి తేడా వుందని చెప్పారు.
మొన్నటిదాకా టీఆర్ఎస్ ను అంటిపెట్టుకొని ఉన్న బూర నర్సయ్య ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలవడం కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపడంతో గులాబీ క్యాంప్ లో గందరగోళం మొదలైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ నేతల తీరును తప్పుబడుతున్నారు బూర. పార్టీని వీడేది లేదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినా చివరకు రాజీనామా చేశారు. దీంతో మునుగోడు టీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. ఎందుకంటే నర్సయ్య గౌడ్ కు బీసీల నుంచి మంచి పట్టు ఉంది. గౌడ సామాజిక నేత కావడం, సేవా కార్యక్రమాలు చేస్తారన్న పేరు ఉండడం.. అలాంటి నేత టీఆర్ఎస్ ను వీడడం.. మునుగోడులో పెద్ద నష్టాన్ని తెచ్చి పెడుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
మునుగోడుకు చెందిన టీఆర్ఎస్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచులతో నర్సయ్యకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్లంతా ఆయన వెంట నడిస్తే కేసీఆర్ అంచనాలన్నీ తారుమారు కావడం ఖాయమని చెబుతున్నారు. మునుగోడులో ఎన్నికల ప్రచారానికి వచ్చే కేంద్ర మంత్రుల సమక్షంలోనే నర్సయ్య గౌడ్ కమలం గూటికి చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు కూడా చేరే అవకాశం ఉంది. దీనికోసం సైలెంట్ గా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అంతా గప్ చుప్ గా టీఆర్ఎస్ లోనే మెదులుతో బూర మాదిరిగా సడెన్ షాక్ ఇచ్చినా ఆశ్చర్యం లేదని మాట్లాడుకుంటున్నారు.
మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డ మరో నేత కర్నె ప్రభాకర్. ఈయన కూడా పార్టీ మారతారా? అనే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే.. మొన్నామధ్య సీఎం కేసీఆర్ తో బూర, కర్నె ఇద్దరు భేటీ అయ్యారు. సీఎం చెప్పినదానికి ఓకే చెప్పి బయటకు వచ్చి.. కలిసి మెలిసి పని చేస్తాం.. కూసుకుంట్లను గెలిపించుకుంటాం అని స్లోగన్స్ ఇచ్చారు. తీరా కొద్ద రోజులకే నర్సయ్య జంప్ అయ్యారు. ఇప్పుడు అందరి దృష్టి కర్నెపై పడింది. ఆయన కూడా గుడ్ బై చెబుతారా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు బూర ఇచ్చిన షాక్ తో గులాబీ అగ్రనాయకత్వం అలర్ట్ అయింది. నర్సయ్య అనుచరులు ఎవరెవరు ఆరాలు తీస్తోంది. ఆయన సన్నిహితులపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు.. ఎవరికి టచ్ లో ఉన్నారు. ఇలా అన్నింటిపై ఆరా తీస్తున్నారట. దానికి ఓ పెద్ద కారణం ఉంది. మునుగోడులో బీసీ ఓట్లు 1.40 లక్షల వరకు ఉంటాయి. ఇప్పుడు బీసీ నేతలు దూరమైతే.. ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. అందుకే.. గులాబీ నేతలు బుజ్జగింపులకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు మాట్లాడుకుంటున్నారు.