చత్తీస్‌గఢ్‌లో మావోయిస్ట్‌లు భద్రత దళాలను ట్రాప్ చేసి హతమార్చిన ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ గా ఉంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పరిశీలించారు. అయితే, ఈ దాడి వెనుక ప్రధాన సూత్రదారిగా మావో అగ్రనేత మడ్వి హిడ్మాగా భావిస్తున్నారు.
తారెమ్ అటవీ ప్రాంతంలో హిడ్మా వేసిన U వ్యూహాంలో భద్రతా దళాలు చిక్కుకున్నాయని, ఒకవైపు నుండి బలగాలు రాగానే మూడు వైపుల నుండి జరిగిన ఆకస్మిక దాడిలో జవాన్లు మరణించారు. ఈ వ్యూహాం హిడ్మా వంటి వారు స్వయంగా పరిశీలించాకే చేసి ఉంటారని, ఇలాంటి దాడులు చేయటం అంత సులువు కాదని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంతకీ మడ్వి హిడ్మా ఎవరు…?
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల్లో ఒకరు ఈ హిడ్మా. చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా పూవర్తి స్వగ్రామం. 50ఏళ్ల వయస్సున్న హిడ్మా… 30 ఏళ్ల క్రితమే మావోల్లో చేరాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ మొదటి బెటాలియన్‌కు హెడ్‌గా, మావోయిస్ట్ సౌత్ సబ్-జోనల్ కమాండర్ గా పనిచేశాడు. బస్తర్ లో మావోల దాడులన్నీ హిడ్మా కనుసన్నల్లోనే జరుగుతాయి. మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగానూ పనిచేశాడు. హిడ్మాపై 45లక్షల రివార్డు కూడా ఉంది. కేంద్ర కమిటీలో చురుగ్గా పనిచేస్తున్న నేతగా హిడ్మాను అనుమానిస్తున్నారు.
2013లో ఝిరామ్ ఘాటీ వద్ద కాంగ్రెస్ నేతల ఊచకోత, 2017 ఏప్రిల్‌లో 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల హత్య సహా 26 దాడుల్లో హిడ్మా హస్తం ఉంది. హిడ్మాను దేవా అని కూడా పిలుస్తారు. హిడ్మాను బస్తర్ మావోలకు వెన్నుముకగా భావిస్తారు. హిడ్మాకు కనీసం నాలుగు అంచెల భద్రత ఉంటుందని, గతంలో అతన్ని పట్టుకునేందుకు చేసిన ఆపరేషన్స్ అన్ని ఫెయిల్ అయినట్లు చత్తీస్ ఘడ్ పోలీసులంటున్నారు.
తాజా దాడి నేపథ్యంలో ఆపరేషన్ హిడ్మా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి.