త్రిపుర ముఖ్యమంత్రిగా కేంద్ర సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ అధికార పగ్గాలను చేబట్టనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ధన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఈమె.. ఈ రాష్ట్ర తొలి మహిళా సీఎం కానున్నారు. ఈ నియోజకవర్గానికి మాజీ సీఎం మాణిక్ సర్కార్ 1998 మార్చ్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్రాతినిధ్యం వహించారు.
ఆశ్చర్యంగా ప్రతిమా భౌమిక్ 1998 లోను, 2018 లోను ఆయనపై ఈ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈ సారి ఇక్కడ విజయం సాధించారు. మూడో సారి తన సత్తా చాటారు. ఇక్కడ సీపీఎం కి చెందిన కౌశిక్ చందా ను 3,500 ఓట్ల తేడాతో ఆమె ఓడించారు. ఈ ఏడాది మాణిక్ సర్కార్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నారు.
2019 లో బీజేపీ టికెట్ పై ఆమె పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2021 జులైలో కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఓ చిన్న రాష్ట్రం తరఫున మొదటిసారి కేంద్రంలో ‘ఈ పదవిని చేబట్టినవారయ్యారు. ఓ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న వ్యక్తి కుటుంబంలో జన్మించిన ప్రతిమా భౌమిక్.. 1991 నుంచే బీజేపీతో తన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.
పార్టీలో పలు పదవులు నిర్వహించారు. ఇటీవలి త్రిపుర ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు గెలుచుకుంది. తిప్రా మోథా 13 స్థానాలను, సీపీఎం 11 సీట్లను, కాంగ్రెస్ మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఓ గుర్తింపు లేకుండా కొనసాగిన ఈ రాష్ట్రానికి ప్రధాని మోడీ గుర్తింపును తీసుకువచ్చారని ప్రతిమా భౌమిక్ వ్యాఖ్యానించారు.