ఉక్రెయిన్-రష్యాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం గురించి పలు వార్తలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చెక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఒక సాధువు(సెయింట్) తన చేతుల్లో జావెలిన్(యాంటీ ట్యాంక్ క్షిపణి లాంచర్)ను పట్టుకున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఉక్రెయిన్ ప్రతిఘటనకు చిహ్నంగా ఆ ఫోటోను సూచిస్తున్నారు. రష్యాకు ధీటైన సమాధానం చెప్పడంలో ఈ జావెలిన్ కీలక పాత్ర పోషిస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అసలు ఏంటి జావెలిన్…
జావెలిన్ అనేది యాంటి ట్యాంక్ మిస్సైల్ లాంచర్. దీన్ని అమెరికా రక్షణ శాఖ 1980లో రూపొందించింది. దీని బరువు 50 పౌండ్లు ఉంటుంది. దీన్ని ఒక సైనికుడు చేతితో సునాయాసంగా ఉపయోగించవచ్చు. దీని కోసం ఎలాంటి మిస్సైల్ లాంచర్స్ అవసరం లేదు. నివేదికల ప్రకారం, ప్రస్తుత యుద్ధంలో ఉక్రేనియన్ ఎక్కువగా జావెలిన్‌పై ఆధారపడినట్టు తెలుస్తోంది.
ఈ క్షిపణిని ఒకసారి ప్రయోగిస్తే, గాలిలోకి 490 అడుగుల ఎత్తుకు వెళ్లి పరావలయం ఆకారంలో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఒకసారి టార్గెట్ ను గురిపెట్టి మిస్సైల్ ను ప్రయోగించిన తర్వాత దాన్ని పక్కకు పడేసి సైనికులు మరో ప్రదేశంలో దాక్కొవచ్చు.
జావెలిన్ ను 1980లో తయారు చేసినప్పటికీ చాలా కాలం వరకు ఉక్రెయిన్ వీటిని కొనుగోలు చేయలేదు. మొదటి సారిగా 2018లో వీటిని అమెరికా నుంచి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.