తెలంగాణ రాష్ట్ర కమల దళానికి రథసారధి ఎవరు..?పార్టీ సీనియర్లకా..? కొత్తగా వచ్చిన నాయకులకా..? ఉత్సాహంగా పార్టీని ముందుకు నడిపించి కార్యకర్తలలో జోష్ నింపే నాయకులకు పగ్గాలు లభిస్తాయా..? లేక సీనియర్లంటూ మూస ధోరణిలో నే పాత వారికే పార్టీ పగ్గాలు అప్పగిస్తారా..? మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఇద్దరు నేతలవి భిన్న దృవాలు. వేర్వేరు పార్టీలకు చెందిన వారిద్దరు రాజకీయ పరిణామాలతో ఒకే పార్టీలో చేరారు. ప్రస్తుతం అదే పార్టీలో రాష్ట్రంలో చక్రం తిప్పడానికి పావులు కదుపుతున్నారు. ఇరువురిలో పార్టీ పగ్గాల రేసులో ఎవరు ముందున్నారు. ఆధ్యక్ష పదవి డీకే అరుణకా… జితేందర్ రెడ్డికా..? కొంతకాలంగా వీరిద్దరు పేర్లు వినపడుతున్నా కేంద్ర అధిష్టానం నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న డీకే అరుణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా కూడా పని చేసిన అనుభవం వుంది.గద్వాల జేజమ్మ గా డీకే అరుణ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా అధికారంలో ఉంటే ప్రతిపక్షాలను. ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనడంలో దిట్టగా. రాజకీయ పరిణితి సాధించిన మహిళా నేతగా డీకే అరుణకు మంచి పేరుంది. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో డీకే అరుణ మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో చెరగని ముద్ర వేసుకున్న డీకే అరుణ అనూహ్యంగా కొందరు నేతలతో భేదాభిప్రాయం వల్ల ఆ పార్టీని వీడారు… అనంతరం బీజేపీలో చేరి గత ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నిలబడి కొద్ది మెజార్టీతో నే ఓడినా అధికార పార్టీ అభ్యర్థికి మాత్రం చుక్కలు చూపించిందని చెప్పవచ్చు. ఇలా ఏ పార్టీలో ఉన్నా డీకే అరుణ రాజకీయ దూకుడు మాత్రం తగ్గలేదు. పార్టీ అప్పజెప్పిన ప్రతి పనిని కార్యకర్తలతో కలిసి ముందుకు నడిపించే వారు. బీజేపీ పార్టీ చేపట్టిన గాంధీ సంకల్ప్ యాత్ర విజయవంతం చేయడంలో డీకే అరుణ ముందుందని చెప్పవచ్చు. ఇలా అధికార పార్టీని ఇరుకున పెట్టే వ్యూహం తో డీకే అరుణ తన రాజకీయ చతురతను చాటుకుంటోంది. ఈ నేపథ్యంలోనే దిశ అత్యాచారం, హత్య ఘటన తర్వాత రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ హైదరాబాదులో కూడా దీక్ష చేపట్టింది. ఇలా వినూత్న రీతిలో అధికార పార్టీని ధైర్యంగా ఎదుర్కొని బీజేపీ పార్టీని ముందుకు నడిపించడంలో డీకే అరుణ కు ఉన్న సత్తా కేంద్ర అధినాయకత్వం నిశితంగా పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకత్వ మార్పు పై పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. డీకే అరుణకు సైతం పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందని బీజేపీ శ్రేణులు సైతం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డీకే అరుణ..బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.
డీకే అరుణ తో పాటు మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ. జితేందర్ రెడ్డి పేరు సైతం రాష్ట్ర అధ్యక్ష పదవి రేస్ లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆరెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా పార్లమెంట్లో ఎంపీగా జితేందర్ రెడ్డి కి మంచి పేరు ఉంది. బీజేపీ నాయకులతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిలో కూడా జితేందర్ రెడ్డి కి సముచిత స్థానం ఉందని పలు సందర్భాల్లో వెల్లడైంది. టీఆరెస్ పార్టీ ఎంపీ గా కొనసాగిన జితేందర్ రెడ్డి పార్లమెంట్లో అన్ని పార్టీల నాయకుల ఆదరాభిమానాలు చూరగొన్న నాయకుడిగా, ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వానికి అందుబాటులో ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ నుంచి టికెట్ లభించకపోవడంతో ఆయన బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి జిల్లాలో జరిగే పలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ రాష్ట్రవ్యాప్త కార్యక్రమాల్లో కార్యకర్తలను ఉత్సాహ పరుస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర అధినాయకత్వం తో టచ్ లో ఉన్నారు.జితేందరెడ్డి ఇప్పటికే అమిత్ షా, నడ్డాలను కలిసి తన బయోడేటాను అందించినట్టు సమాచారం. బలమైన సామాజికవర్గం, కొంతకాలం మినహా బీజేపీతో సుదీర్ఘ అనుబంధం తదితర అంశాలను ఆయన జాతీయ నాయకత్వానికి వివరించినట్లు తెలిసింది. భవిష్యత్తులో ఏ పదవి వచ్చినా అలంకరించేందుకు జితేందర్ రెడ్డి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన డీకే అరుణ, జితేందర్ రెడ్డిలకు రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టే సత్తా ఉందని కేంద్ర అధినాయకత్వం గుర్తించినట్లు తెలుస్తున్నది. ఈ ఇద్దరు నేతలు పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ భవిష్యత్తులో రాష్ట్ర అధ్యక్ష పదవి లేదా కేంద్ర స్థాయిలో మరేదైనా నామినేటెడ్ పదవి కోసం ఆశ గా ఎదురుచూస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర బాధ్యుడు కృష్ణదాస్ జరిపిన తొలివిడత అభిప్రాయ సేకరణలో రాష్ట్ర నేతలు ఎక్కువ మంది ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ వైపు మొగ్గు చూపారు. రెండో దఫాలో మాత్రం నాయకత్వ మార్పు జరగాలని కొందరు సూచించినట్లు తెలిసింది. ఇటీవల దిల్లీకి వెళ్లిన లక్ష్మణ్.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాలను కలిసి వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తన మూడేళ్ల పనితీరుతో పాటు.. సికింద్రాబాద్ లోకసభ టికెట్ దక్కని విషయాన్ని నడ్డాకు వివరించినట్లు తెలిసింది. సామాజికవర్గం, సీనియారిటీ వంటి అంశాలూ కలిసివస్తాయని.. పార్టీ పగ్గాలు మళ్లీ తనకే దక్కుతాయని లక్ష్మణ్ ధీమాతో ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరావు పేరును సైతం కేంద్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో లక్ష్మణ్, మురళీధరావు, డీకే అరుణ, జితేందర్రెడ్డిలలో ఎవరికి తెలంగాణ కమలదళ నాయకత్వం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఏది ఏమైన పార్టీలో కొత్తగా చేరినవారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం లేదంటూ.. జాతీయ పార్టీలో కీలక నేత నుంచి సంకేతాలు అందినట్లు తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఒకరు తాజాగా తన సన్నిహితులతో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ముందు నుంచి పార్టీలో ఉండటంతో పాటు.. పార్టీ బలోపేతానికి కృషిచేసే వారికే పగ్గాలు దక్కుతాయా….లేక పార్టీనీ ఉత్సహంగా నడిపించే వారికా…ఆధికార పార్టీని ధీటుగా ఎదుర్కోనే నాయకులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారో వేచి చూడాలి.!