టీడీపీలో సీనియర్ల మధ్య వార్ ముదురుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కొని..ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు మేమున్నామని రావడం ఏమాత్రం సరికాదని అయ్యన్నపాత్రుడు గంటా శ్రీనివాస్ రావు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవడండీ.. గంటా..లక్షల్లో వాడొక్కడు..లక్షల్లో నేనొక్కడిని అంటూ సంచలన కామెంట్లు చేశారు.
గంటా ఏమైనా పెద్ద నాయకుడా.. ప్రధానా.. అంటూ ప్రశ్నించిన ఆయన పార్టీలో అందరూ రావాలి.. పని చేయాలన్నారు. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక అని స్పష్టం చేశారు. మేం ఎవ్వరికీ వ్యతిరేకులం కాదు.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండాలనే మేం కోరుకుంటున్నామన్న ఆయన అలా అండగా ఉండని వారిని చూస్తేనే మాకు బాధేస్తుందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారని అయ్యన్న ఫైర్ అయ్యారు.
టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారని తెలిపారు అయ్యన్నపాత్రుడు. సాఫ్ట్ వేర్ కంపెనీ..హార్డ్ వేర్ కంపెనీలే కాదు.. అండర్ వేర్ కంపెనీలు కూడా పోతున్నాయని ఎద్దేవా చేశారు. జాకీ అండర్ వేర్ కంపెనీని కేటీఆర్ పట్టుకుపోయారు. రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. బ్రాందీ షాపులను 25 ఏళ్ల తనఖా పెట్టి 8700 కోట్లు అప్పు తెస్తారా.. అని అయ్యన్న ఎద్దేవా చేశారు.
అయితే గంటా రెండేళ్ల పాటు కరోనా ఉందని.. తరువాత తనకు అనారోగ్యం ఉండడం కారణంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. తిరిగి తాను పార్టీలో యాక్టివ్ గా ఉంటానని వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలో అయ్యన్న ఆయన పై ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.