హైకోర్టు తీర్పుతో సీఎస్ సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదీగాక.. తెలంగాణ నుంచి ఆయన్ను రిలీవ్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ. తక్షణమే సోమేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 12లోగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.
సోమేష్ ను తొలగించాలని ప్రతిపక్షాలు కోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సోమేష్.. సీఎంను కలిశారు. తాజా పరిస్థితులపై చర్చించారు. అయితే.. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండకపోవచ్చని న్యాయశాఖ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరు అనే చర్చ జోరందుకుంది. ఆయన తర్వాత సీఎస్ గా ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఉన్నతాధికారులైన అరవింద్ కుమార్, రామకృష్ణారావులలో ఒకరిని సీఎస్ గా నియమించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అరవింద్ కుమార్ అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అయితే.. రామకృష్ణారావు వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని.. ఏ క్షణమైనా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఇటు రజత్ కుమార్ పేరు కూడా సీఎస్ లిస్టు పరిశీలనలో ఉందని సమాచారం.