వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానందస్వామి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే పేరుతో ఓ ‘దేశాన్ని’ ఏర్పాటు చేసుకోవడమే గాక ఐక్యరాజ్యసమితిలో తన దేశ ప్రతినిధిగా ఓ మహిళను కూడా పంపారు. విజయప్రియ అనే ఈ మహిళ..తలకు తలపాగా, ఆభరణాలు, నుదుటిన తిలకం, మెడలో రుద్రాక్ష జపమాల ధరించి, చీరకట్టులో ఐరాస సమావేశానికి హాజరయ్యారు. తనను తాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశానికి చెందిన శాశ్వత ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిత్యానంద చిత్రాన్ని తన కుడిచేతిపై టాటూగా వేసుకున్న ఈమె ఇతర మహిళలతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం… విజయప్రియ కెనడాలోని మనిటోబా యూనివర్సిటీలోమైక్రోబయాలజీ బీఎస్సీ హానర్స్ చేసిందట. 2014 జూన్ లో యూనివర్సిటీ డీన్స్ హానర్ లిస్టులో ఈమె ఉందని, ఇంగ్లీష్,తో బాటు ఫ్రెంచ్, క్రోలీ, ఇంకా ప్రెంచ్ సంబంధిత పిడ్జింగ్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదని తెలుస్తోంది. తమ దేశం కోసం ఈమె పని చేస్తోందని కైలాసకు సంబంధించిన వెబ్ సైట్ పేర్కొంది.
గతనెల 24 న జెనీవాలో ఐరాస.. 19 వ ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక హక్కులపై నిర్వహించిన సదస్సులో విజయప్రియ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఈమె పలు దేశాల ప్రతినిధులతో సమావేశమై ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ వీడియాలో ఈమె కొందరు అమెరికన్ అధికారులతో కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేస్తున్నట్టు కనిపించింది.
‘కైలాస’ అనేక దేశాల్లో తన రాయబార కార్యాలయాలు, ఎంజీవోలను ప్రారంభించిందని విజయప్రియ నిత్యానంద వెల్లడించారు. ఇండియాలో కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు.. స్వామి నిత్యానందను వేధించాయని, కానీ, ఇండియాను తమ దేశం ఎంతో గొప్పగా చూస్తుందని, గౌరవిస్తుందని ఆమె ట్వీట్ చేశారు. ఈ శక్తుల పట్ల భారత ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవాలని ఆమె కోరారు. అయితే ఈమె చర్యలతో, స్టేట్మెంట్లతో తమకు సంబంధం లేదని, ఓ ఎంజీవో తరఫున ప్రతినిధిగా మాత్రమే ఆమె సదస్సుకు హాజరయ్యారని ఐరాస మానవ హక్కుల కార్యాలయం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.