దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ కు ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు రాలేదు. ఇండియా సహా కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కొనసాగుతున్నా… డబ్ల్యూహెచ్వో గుర్తింపు పొందిన కరోనా వ్యాక్సిన్స్ లిస్టులో మాత్రం కోవాగ్జిన్ లేదు.
ఇప్పటికే భారత్ బయోటెక్ కంపెనీ వర్గాలు ఓసారి గుర్తింపు కోసం తమ ట్రయల్స్ డేటాను పంపగా… మరింత డేటా పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పెండింగ్ లో పెట్టింది. దీంతో కంపెనీ వర్గాలు వారు అడిగిన సమాచారం, డాక్యుమెంట్స్ పంపారు. దీనిపై ఇప్పటికే పరిశీలన స్టార్ట్ చేసిన డబ్ల్యూహెచ్వో… ఈ వారంలో ఓ నిర్ణయం తీసుకోబోతుంది. అయితే, తాము ఇచ్చిన డేటాతో నిపుణులంతా అంగీకరిస్తారని, గుర్తింపు కూడా వచ్చేస్తుందని కంపెనీ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. ఇటీవలే భారత వైద్యారోగ్య శాఖ మంత్రి డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తోనూ మాట్లాడారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు వస్తే కోవాగ్జిన్ మరిన్ని దేశాల్లో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు అస్ట్రాజెనికా, ఫైజర్, మెడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, సినోవాక్, సినోఫార్మ్ వి వ్యాక్సిన్ లకు డబ్ల్యూహెచ్వో గుర్తింపు లభించింది.