సరూర్‌నగర్ ఎస్ఓటీ కార్యాలయంలో మాజీ సీఐ నాగేశ్వరరావును ప్రశ్నిస్తున్నారు ఏసీపీ. అతనిపై అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కింద కేసు నమోదైంది. రెండేళ్లుగా బాధితురాలిని వేధిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే విచారణ కొనసాగుతోంది.
ఇటు నాగేశ్వరరావు వ్యవహారాలపై రాచకొండ పోలీసులు ఆరా తీస్తున్నారు. అతను టాస్క్ ఫోర్స్ సీఐగా ఉన్నప్పుడు చేసిన సెటిల్ మెంట్లపై దర్యాప్తు చేస్తున్నారు. ఎవరి ఫోన్ అయినా సరే సెల్ ఫోన్స్ లోకేషన్ లు చూడటంలో ఈయన దిట్ట. విధినిర్వహణలో వినియోగించుకోవాలసిన సేవలను నేరాలకు, సెటిల్ మెంట్లకు ఉపయోగించినట్లు నిర్ధారణకు వచ్చారు.
నాగేశ్వరరావు సర్వీస్ ప్రొవైడర్ కంపెనీల ప్రతినిధులతో దోస్తీ చేసినట్లు.. దానికి ప్రతిఫలంగా విందులు, గిఫ్టులు అందించిట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే నాగేశ్వరరావు కోట్లకు పడగలెత్తాడని సమాచారం. టాస్క్ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే ఫాంహౌజ్ కొన్నాడు. అతని బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో బాధితురాలికి కరోనా పాజిటివ్ రావడంతో నాగేశ్వరరావుకు కూడా ఉండొచ్చని.. పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసులు. విచారణ, పరీక్షల తరువాత రిమాండ్ కి పంపనున్నారు. బంజారాహిల్స్ సీఐగా ఉన్నప్పుడు నాగేశ్వరరావుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఘటన జరిగాక అజ్ఞాతంలో ఉంటూ కేసు వెనక్కి తీసుకోవాలని బాధితులని బెదిరింపులకు దిగాడని తెలుస్తోంది. ఈ కేసు నుంచి అతడ్ని బయటపడేసేందుకు ఓ మీడియా ప్రతినిధి సహకరించాడని ప్రచారం జరుగుతోంది.
మీడియా ప్రతినిధి పాత్రపైనా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. నాగేశ్వరావుతో అంట కాగిన ఆ మీడియా ప్రతినిధి.. అతను చెప్పిన విధంగా గతంలో వార్తలు ఇచ్చినట్లు సమాచారం. వీరి మధ్య డీలింగ్స్ పైనా పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు సీపీ ఆనంద్.