ఏడాది కాలంగా యావత్ వ్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలను తేల్చేందుకు డబ్ల్యూహెచ్ బృందం సిద్దమైంది. 10 మంది నిపుణులతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం వుహాన్‌కు చేరుకుంది. వివిధ దేశాలకు చెందిన వీరంతా.. సింగపూర్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా వుహాన్‌లో అడుగుపెట్టారు. అయితే నిపుణుల బృందం పర్యటనను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న చైనా.. ఇప్పుడు కూడా దర్యాప్తునకు ముందు పలు నిబంధనలు విధించింది.
డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం కూడా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని చైనా వారికి సూచించింది. దీంతో వారి పరిశోధన మొదలు కావాలంటే మరో 14 రోజులు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే క్వారంటైన్ సమయంలో.. చైనా మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌తో వర్చువల్ విధానంలో ఈ బృందం భేటీ కానుంది. వారు చెప్పిన వివరాల ఆధారంగా వైరస్ పుట్టుకకు సంబంధించిన దర్యాప్తు మొదలుపెట్టనుంది. వాస్తవానికి గత నెలలోలనే అంతర్జాతీయ నిపుణుల బృందం చైనా రావాల్సి ఉంది. కానీ తొలుత వారి పర్యటనకు చైనా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ దేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. చివరికి దిగొచ్చింది.