ప్రపంచ ఆరోగ్య సంస్థపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహంగా ఉంది. కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరు పట్ల చాలా మంది అసంతృప్తితో ఉన్నారని ట్రంప్ పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాపై ప్రేమ కనబరుస్తుందని రిపబ్లికన్ సెనెటర్ మార్కో రుబియో చేసిన ఆరోపణలపై ప్రశ్నించగా ట్రంప్ పై విధంగా స్పందించారు.
కాంగ్రెస్ సభ్యుడు మైఖేల్ మెకౌల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అథోమ్ గెబ్రెసెస్ సమగ్రతను ప్రశ్నిస్తూ..చైనాతో సంబంధాలను టెడ్రోస్ గౌరవిస్తారనడానికి అతనికి గతంలో ఎన్నో రెడ్ ప్లాగ్స్ ఉన్నాయని అన్నారు. సమస్య సద్దుమణిగాక చైనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కున్న సంబంధాలను బయటపెడితే నిజాన్ని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. మరో కాంగ్రెస్ సభ్యుడు గ్రెగ్ స్టీబ్ కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా ప్రచార సంస్థగా మారిందన్నారు. ప్రాణాంతక వైరస్ నియంత్రణలోకి వచ్చాక ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా రెండూ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి కొమ్ము కాస్తూ ప్రపంచానికి వ్యతిరేకమైందని మరో సెనేటర్ జోష్ హౌలీ ఆరోపించారు.
WHO డైరెక్టర్ చైనా నాయకత్వాన్ని ప్రశంసించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయ. చైనాలో కరోనా వైరస్ గురించి వాస్తవాలు వెల్లడించకుండా దాచిపెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జనవరి లో చైనా వెళ్లిన WHO డైరెక్టర్ ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ ను కలిసి వచ్చారు. ఆ తర్వాత కరోనా వైరస్ నియంత్రణకు ఆ దేశం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటి వరకు 21,293 ప్రాణాలను బలి తీసుకుంది. 4,71,518 మంది కి సోకిందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా తెలియజేస్తోంది.