ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మంకీపాక్స్ ను తక్కువగా అంచనా వేయటం పెద్ద పొరపాటు అవుతుందని డబ్ల్యూహెచ్చరించింది. మంకిపాక్స్ పట్ల కఠిన వైఖరిని అవలంభించాలని ప్రపంచ దేశాలకు సూచనలు చేసింది.
చాలా దేశాలు మంకిపాక్స్ ను చిన్న వ్యాధిగా ట్రీట్ చేస్తున్నట్టు తెలుస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటువ్యాధులు, నివారణ విభాగాధిపతి సిల్వి బ్రియాండ్ అన్నారు. ఈ వ్యాధిని అంతర్జాతీయ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆమె అన్నారు.
మంకీపాక్స్ గ్లోబల్ పాండెమిక్ గా మారే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ… ఇప్పుడే ఏమీ చెప్పలేమని, బహుశా అలాంటి పరిస్తితి రాకపోవచ్చన్నారు. మంకీపాక్స్ అసిమ్టమెటిక్ గా వ్యాప్తి చెందుతోందా అనే విషయంపై ఇప్పుడే చెప్పలేమన్నారు.
మంకీపాక్స్ అనేది స్మాల్ పాక్స్ కు సంబంధించినది. 1980లో నివారించే సమయాని కన్నా ముందు లక్షలాది మంది స్మాల్ పాక్స్ బారిన పడి మరణించారు. అయితే మంకిపాక్స్ అనేది స్మాల్ పాక్స్ తో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారు కేవలం మూడు నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నట్టు వివరిస్తున్నారు.