బీజేపీ కొత్త సారధి రేసు మొదలైంది. ఎవరు కొత్త అధ్యక్షుడవుతారు అన్నది పక్కన పెడితే… ఎవరికి ఇవ్వాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉంది కేంద్ర అధినాయకత్వం అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నడిపించే నాయకుడి కోసం వేట మొదలైనా… సరైన నేత దొరకటం లేదన్న వాదన ఊపందుకుంది. క్షేత్ర స్థాయిలో పార్టీ అంతంత మాత్రమే ఉన్న, టిఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం అని వచ్చే ప్రభుత్వం మాదే అని బీజేపీ రాష్ట్ర నేతలు ప్రకటనలు చేస్తున్నారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు, దానిపై కనీసం సమీక్ష కూడా చేయని రాష్ట్ర బీజేపీ నేతలు అధ్యక్ష పదవి కోసం మాత్రం అర డజను మంది పోటీ పడుతున్నారు.
రాష్ట్ర బీజేపీ పగ్గాలు మాకే ఇవ్వండి అని అరడజను మంది నేతలు అడుగుతున్నారు. కొత్త పాత తేడా లేకుండ పోటీ పడుతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన డీకే అరుణ, జితేందర్ రెడ్డి లు కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టు బడుతున్నారు. డీకే అరుణకు మాస్ ఇమేజ్, కేసీఆర్ ను ఎదురుకునే చరిష్మా ఉన్న పార్టీలోకి కొత్తగా రావడం ఆమెకు మైనస్ గా మారింది. జితేందర్ రెడ్డి కూడా కొత్తగా పార్టీలోకి రావడం తో పాటు, మాస్ ఇమేజ్ కూడా లేదు.
వీరితో పాటు బీజేపీ లోని కొందరు సీనియర్లు కూడా అధ్యక్ష పగ్గాలు ఆశిస్తున్నారు. రఘునందన్ రావు, కృష్ణ సాగర్, మురళీధర్ రావు పోటీ పడుతున్నారు. కృష్ణ సాగర్ కు అధ్యక్ష పదవి ఇవ్వడానికి కేంద్ర పార్టీ సిద్ధంగా లేదు. రఘునందన్ విషయంలో రాష్ట్ర పార్టీలో విభేదాలు ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. మురళీధర్ రావు కు ఇస్తే టిఆర్ఎస్ B టీం గా బీజేపీ మారుతుందేమో అన్న భయం కేంద్ర పార్టీలో ఉందని సమాచారం. బీసీ నేత ఆచారి అడుగుతున్నప్పటికి ఆయనకు ఇచ్చినా పార్టీలో విభేదాలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పార్టీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారట.
ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీని అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు, కొత్త వారిని నియమిస్తే లేని సమస్యలు వస్తాయని, దీంతో కొత్త సారథిగా ఎవరిని నియమించాలో తెలియక కేంద్ర పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నట్లు తెలిస్తుంది. ఈ సమయం లో లక్ష్మణ్ ను కొనసాగించడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయిందట..