పుష్ప పార్ట్-1లో ఐటెంసాంగ్ పై చాలా చర్చ నడిచింది. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ నుంచి కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ వరకు చాలా పేర్లు తెరపైకొచ్చాయి. ఫైనల్ గా ఈ సినిమాలో ఐటెంసాంగ్ చేసే ఛాన్స్ సమంతను వరించింది.
‘ఊ అంటావా’ అంటూ సమంత ఓ ఊపు ఊపేసింది. పుష్ప సినిమాతో రష్మిక కంటే, ఆ ఐటెంసాంగ్ తో సమంతకే ఎక్కువ పేరొచ్చిందనేది వాస్తవం.
ఇప్పుడు పుష్ప-2లో ఐటెంసాంగ్ పై చర్చ మొదలైంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న పార్ట్-2లో ఐటెంసాంగ్ ఉంటుందనే విషయాన్ని ఇప్పటికే సుకుమార్ చెప్పేశాడు. దీంతో ఆ సాంగ్ కోసం రకరకాల పేర్లు తెరపైకొస్తున్నాయి. ఈ చర్చ ఇంత తొందరగా మొదలవ్వడానికి ఓ కారణం ఉంది.
లెక్కప్రకారం పుష్ప-2 షూటింగ్ ఈపాటికి స్టార్ట్ అవ్వాలి. కానీ కరోనా పరిస్థితుల వల్ల షూటింగ్ లేట్ అవుతోంది. ఈ గ్యాప్ లో గడ్డం తీసేయాలని భావిస్తున్నాడట బన్నీ. అతడు గడ్డం తీసేసే లోపు పార్ట్-2కు సంబంధించి ఐటెంసాంగ్ షూటింగ్ పూర్తిచేయాలని అనుకుంటున్నారట. అందుకే ఈ పాటపై ఇప్పట్నుంచే చర్చ మొదలైంది. మరి ఈసారి ఆ అవకాశం ఏ హీరోయిన్ కు దక్కుతుందో చూడాలి.