వచ్చే ఎన్నికల్లో మోడీ ఓడిపోవటం ఖాయం, బీజేపీని హ్యాట్రిక్ కొట్టనివ్వం అని చాలా పార్టీలు, నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. ఇంతవరకు ఆలోచన బాగానే ఉన్నా… మోడీని ఓడించే నేత ఎవరు, ఎ నినాదంతో ఓడిస్తారు, ఓడించే కార్యాచరణ ఎక్కడ అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
బీజేపీ తర్వాత దేశంలో అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ కాంగ్రెస్. కానీ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం మోడీని ఓడించే పక్కా ప్రణాళికతో ఉన్నట్లు కనిపించటం లేదు. ఓవైపు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు చేజారుతున్నాయి. నాయకులంతా పార్టీని వీడుతున్నారు. కనీసం మోడీని ఓడించాక తాము ఏం చేస్తామో చెప్పే మేనిఫెస్టో సైతం కాంగ్రెస్ చెప్పలేకపోతుంది. అందుకే కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండే శరద్ పవార్ సైతం ఆ పార్టీ నాయకత్వాన్ని జమీందార్లతో పోల్చారు. బీజేపీ అద్వాని, జోషీల హయం నుండి మోడీ, అమిత్ షా హయంకు మారింది. కానీ కాంగ్రెస్ అలా మారటంలో విఫలం అయ్యిందన్న వాదనలున్నాయి.
Advertisements
పార్టీ పరిస్థితులు ప్రభావం తగ్గుతున్నా… గత రెండు సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి 20శాతం ఓట్లు పడ్డాయి. అవన్నీ ఎన్నో సంవత్సరాలుగా ఏర్పడ్డ ఓట్ బ్యాంక్. కానీ ఇప్పుడు ఆ ఓటర్లు కూడా ఇతర పార్టీల వైపు మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గుచూపే పరిస్థితులు దేశంలో కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన బెంగాల్, త్రిపుర, తమిళనాడు ఇలా ఏ రాష్ట్రంలో చూసినా పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా పక్క పార్టీలకు వెళ్లిపోతుంది. ఇక పంజాబ్ లో పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ చాప కింద నీరులా గట్టిగా పనిచేస్తుంది. నిజానికి చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతలు గెలుస్తున్నా… అందులో చాలా మంది బీజేపీయేతర నేతలున్నా… వారిని నడిపించే నాయకుడి స్థానంలో రాహుల్ లేరన్నది విశ్లేషకుల మాట.
నిజానికి మమత బెనర్జీ బీజేపీ మోడీ-షా టీంను సక్సెస్ ఫుల్ గా ఎదుర్కొంటున్నారు. ఆ స్థానంలో ఉండాల్సింది రాహుల్ వంటి లీడర్లు. కానీ ప్రాంతీయ పార్టీల నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పాత్రను పోషించేందుకు రెడీ అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
కానీ ప్రజాస్వామ్యంలో… అందులోనూ భారత్ లో అధికారం శాశ్వతం కాదు అన్నది చరిత్ర చెప్తోంది. 1977లో తాను ఓడిపోతానని ఇందిరా అనుకుందా?1984లో స్వీప్ చేసిన తర్వాత 1989లో ఓడిపోతానని రాజీవ్ ఊహించాడా?2004లో పరాజయం తప్పదని అసలు వాజ్ పేయి ఊహించాడా? అనేది కూడా ఓ సారి బీజేపీ టీం కూడా ఆలోచించాల్సి ఉంటుంది.